2030 నాటికి ఐదవ అతిపెద్ద ఎక్స్‌పోర్ట్ కంట్రీగా ఇండియా
ప్రధాని నరేంద్ర మోదీ
హైదరాబాద్, జనవరి11(జనంసాక్షి) : భారత్‌ను తయారీ హబ్‌గా తీర్చిదిద్దుతామనీ ప్రపంచస్థాయిలో స్మార్ట్‌సిటీల అభివృద్ధి చేపడతామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన ఉజ్వల గుజరాత్ శిఖరాగ్ర సదస్సులో ఆయన అన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందే దేశంగా ఐఎంఎఫ్ అంచనా వేసిందని చెప్పారు. భారత్ తయారీ రంగం హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. 2030 నాటికి భారత్ ఐదో అతిపెద్ద ఎగుమతుల దేశంగా ఆవతరిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. సాగరమాల పేరుతో ఓడరేవుల నిర్మాణం, రహదారులతో అనుసంధానం చేస్తామన్నారు. పరిశ్రమలకు అనుమతుల కోసం సింగిల్ విండో విధానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫ్రాన్స్‌లో జరిగిన ఉగ్రదాడులను మోదీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. భారత్‌తో కలిసి పనిచేయడానికి ప్రపంచ దేశాలు అత్యంత ఆసక్తి చూపుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తమ ప్రభుత్వం కేవలం హామీలు, విధానాలు ప్రకటించడమే కాకుండా చిత్తశుద్ధితో వాటిని అమలు చేస్తోందన్నారు. ప్రధానమంత్రి ధన్‌జన్ యోజన ద్వారా 100 రోజుల్లోనే 10 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు తెలిపారు. ప్రపంచమంతా వసు’య్రక కుటుంబం అని భారత్ విశ్వసిస్తోందన్నారు. ప్రపంచమంతా సుఖంగా ఉండాలన్నదే తుది లక్ష్యమని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు గుబాళిస్తున్నాయన్నారు. భారత్ అంటే నగరాలే కాదని.. వేలాది పల్లెసీమలు, పట్టణాలని వ్యాఖ్యానించారు. యోగా మానవ జీవన విధానాన్ని మారుస్తుందని.. దానికి అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చినందుకు ఐక్యరాజ్యసమితికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.





