Tuesday, 3 November 2026

ఫిరాయింపులపై అసెంబ్లీలో లొల్లి

Untitled-5

పోడియం వైపు దూసుకెళ్లిన కాంగ్రెస్‌

చర్చకు విపక్షం పట్టు

పలుమార్లు సభ వాయిదా

ఫిరాయింపులు ప్రోత్సహించింది కాంగ్రెస్సే : కేటీఆర్‌

హైదరాబాద్‌, నవంబర్‌ 17 (జనంసాక్షి) : పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీలో దుమారం రేగింది. స్పీకర్‌ పోడియం వద్దకు కాంగ్రెస్‌ శాసనసభ్యులు దూసుకెళ్ళారు. పార్టీ ఫిరాయింపులపై విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టారు. దీంతో స్పీకర్‌ పలుమార్లు సభను వాయిదావేశారు. ఫిరాయింపుల సంస్కృతి తమది కాదని, వాటిని ప్రోత్సహించింది కాంగ్రెస్‌ పార్టీయేనని మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఫిరాయింపులపై అసెంబ్లీలో చర్చ జరపాలని కాంగ్రెస్‌ పార్టీ పట్టుబట్టడంతో సభకు అంతరాయం కలిగింది. రెండుసార్లు వాయిదా పడినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో స్పీకర్‌ మధుసూదనారావు అసెంబ్లీని మంగళవారానికి వాయిదా వేశారు. సోమవారం ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే సభాపతి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే, తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత జీరో అవర్‌లో వాయిదా తీర్మానాలను పరిశీలిస్తామని స్పీకర్‌ ప్రకటించారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాతే వాయిదా తీర్మానాలని బీఏసీలో చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు పట్టువీడలేదు. వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాల్సిందేనని ఆందోళనకు దిగాయి. దీంతో స్పీకర్‌ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభం కాగానే కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు సభను అడ్డుకున్నారు. పార్టీ ఫిరాయింపులపై చర్చ చేపట్టాలని ఆందోళనకు దిగారు. పోడియంలోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి సభను అడ్డుకొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, దీనిపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ఫిరాయింపులపై చర్చించాలని, పార్టీ మారిన వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరారు. ఈ నేపథ్యంలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకున్నారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి సహకరించాలని కోరారు. ఆ తర్వాత వాయిదా తీర్మానాలపై స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారన్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఫిరాయింపులను ప్రోత్సహించిందని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు కాదు.. ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని చీల్చలేదా? వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోలేదా? మొన్నటికి మొన్న తమ పార్టీ ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే అరవిందరెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోలేదా? అని ప్రశ్నించారు. సభా వ్యవహారాల ప్రకారమే శాసనసభ నడుస్తుందని, అందుకు సభ్యులంతా సహకరించాలని కోరారు. కానీ, కాంగ్రెస్‌ సభ్యులు శాంతించలేదు. పైగా నినాదాలు ఉద్ధృతం చేశారు. దీంతో సభ మరో అరగంట వాయిదా పడింది. తిరిగి అసెంబ్లీ సమావేశమైన అనంతరం కూడా కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు ఆందోళన ప్రారంబించారు. ఫిరాయింపులపై చర్చ జరపాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కే.తారకరామారావు జోక్యం చేసుకుంటూ.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్‌ పార్టీయేనని విమర్శించారు. 2004లో తమ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోలేదా? అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై చర్చకు కాంగ్రెస్‌ పట్టుబట్టడం. .వంద ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లు ఉందని ఎద్దేవా చేశారు. దీంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నిరసన జోరును మరింత పెంచారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభాపతి ఎంత విన్నవించినా ప్రతిపక్షాలు శాంతించకలేదు. దీంతో స్పీకర్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

ముఖ్యమంత్రిపై మండిపడిన కాంగ్రెస్‌

పార్టీ ఫిరాయింపులపై శాసనసభలో చర్చించే వరకు సభను నడవనివ్వబోమని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వంపై ఎన్నికల సంఘం, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రిని అనర్హుడిగా ప్రకటించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌లో చీలిక భయంతోనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సోమవారం శాసనసభ వాయిదా పడిన అనంతరం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసి జీవన్‌రెడ్డి విూడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌లో చీలిక భయంతోనే ముఖ్యమంత్రి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పార్టీలో కొడుకు, అల్లుడు మధ్య పోరు పెరిగితే తనకు ఇబ్బందనే ఉద్దేశ్యంతో, అభద్రతా భావంతోనే కేసీఆర్‌ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడమేనిది నైతికమని చెప్పారు. తెలంగాణను అడ్డుకోవడానికే ఆనాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహించారని ఆయన తెలిపారు. కేసీఆర్‌ కూడా వైఎస్‌ బాటలోనే పయనిస్తారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీకి చూపే కృతజ్ఞత ఇదేనా? అని నిలదీశారు. కేసీఆర్‌ తీరు, ఫిరాయింపులపై త్వరలోనే గవర్నర్‌కు, ఎన్నికల సంఘానికి, సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేస్తామన్నారు. స్పీకర్‌ కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హతు వేటు వేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉన్నా ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదన్నారు. పార్టీ అధ్యక్షడిగా కేసీఆర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ సర్కారు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు. ముఖ్యమంత్రి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా మెదక్‌లో రైతులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పాలనలో అందరికీ పింఛన్లు అందించామన్నారు. కానీ, టీఆర్‌ఎస్‌ సర్కారు అర్హత పేరుతో పింఛన్లను కుదిస్తోందని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *