పేలుళ్ల మధ్య పాక్ ఎన్నికలు
60 శాతం పోలింగ్
కౌంటింగ్ ప్రారంభం
నవాజ్ షరీఫ్, ఇమ్రాన్‌ఖాన్ గెలుపు
పీఎంఎల్(ఎన్)కు విజయావకాశాలు
ఇస్లామాబాద్/కరాచి, (జనంసాక్షి) :
బాంబుపేలుళ్లు, అనేక అవాంఛనీయ సంఘటనల మధ్య పాకిస్థాన్ పార్లమెంట్‌కు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్‌లో 342 స్థానాలు, అసెంబ్లీలలో 728 స్థానాలు ఉన్నాయి. తాలిబన్‌ల హెచ్చరికలను ఖాతరు చేయకుండా పాక్ ఓటర్లు పోలింగ్ కేంద్రాలవద్ద బారులు తీరారు. ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభమయింది. పోలింగ్ మొదలైన మొదట్లోనే ఓటుహక్కు వినియోగించుకున్నవారిలో సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ అష్రష్ పర్వేజ్ కయాని, ఎన్నికల ప్రధానాధికారి ఫక్రుద్దీన్ ఇబ్రహీమ్ ఉన్నారు. దేశంలో మొత్తం 8కోట్ల 60 లక్షలమంది ఓటర్లు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో 4,670 మంది. అసెంబ్లీ ఎన్నికలలో 11 వేలమంది సైనికులతో సహా వేలమంది భద్రతా సిబ్బంది శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. నాలుగు పార్టీలమధ్య చతుర్ముఖ పోటీ నెలకొని ఉంది. మాజీ ప్రధానమంత్రి నేతృత్వంలోని పీఎమ్‌ఎల్(ఎన్) పార్టీ అతిపెద్దపార్టీగా అవతరిస్తుందని భావిస్తున్నారు. మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రి కే ఇన్‌సాఫ్ పార్టీకూడా పంజాబ్ రాష్ట్రంలో, పట్టణ ప్రాంతాలలో బాగానే ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. పాకిస్తాన్‌లో ఇంతకుముందు ఐదేళ్లూ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. 66 ఏళ్ల పాకిస్తాన్ చరిత్రలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఒక ప్రభుత్వం పూర్తిపదవీకాలం అధికారంలో ఉండటం ఇదే మొదటిసారి. మరోవైపు పాకిస్తాన్‌లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉండటం సహజం. 2008 జరిగిన గత ఎన్నికలలో 44శాతం పోలింగ్ నమోదయింది. ఫలితాలు రేపు రానున్నాయి.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైననాటినుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న హింసాకాండలో సుమారు 100 మంది చనిపోగా. తాజాగా ఇవాళకూడా కరాచీ, క్వెట్టా, పెషావర్ నగరాలలలో నాలుగు బాంబుదాడులు జరిగాయి. ఇవాళ్టి ఘటనలలో 10మంది చనిపోగా, 40 మంది గాయపడ్డారు. తీవ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, అవామీ నేషనల్ పార్టీ, ముత్తహీద ఖ్వామీ మువ్‌మెంట్ పార్టీలు తమ ప్రచారాన్ని నియంత్రించుకున్నాయి. రాత్రి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కడపటి వార్తలందేసరికి నవాజ్‌షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్(ఎన్) 110 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. తెహ్రిక్ -ఎ- ఇన్సాఫ్ పార్టీ 32 స్థానాల్లో, పీపీపీ 31 స్థానాల్లో ఇతరులు పది స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నవాజ్ షరీఫ్ స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని ఎగ్జిట్‌పోల్ సర్వేలు అంచనా వేశాయి. తెహ్రిక్ -ఎ- ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు మాజీ పెషావర్ స్థానం నుంచి విజయం సాధించారు. నవాజ్ షరీఫ్ పంజాబ్‌లో సర్గోదా నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. బాంబు పేలుళ్లలో ఒకరు మృతిచెందగా, పలువురు తీవ్రగాయాలపాలయ్యారు.