ప్రజలకు అబద్దాలు చెప్పడానకే పాదయాత్ర
ప్యారడైజ్ పేపర్లతో జగన్ అవినీతి జగద్విదతం : సోమిరెడ్డి
ఒంగోలు,నవంబర్7(జనంసాక్షి): ప్రజలకు అబద్దాలు చెప్పేందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్.. అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం ఇష్టమొచ్చినట్టు మాట్లాడినందుకు ప్రజలు తగిన గుణపాఠం నేర్పించారని అన్నారు. రాష్టాభ్రివృద్ధి కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పని చేస్తోందని తెలిపారు. ప్రతిపక్షాలు సహేతుకమైన విమర్శలు చేయాలి తప్ప ప్రేలాపనలు సరికాదన్నారు. వైకాపా అధినేత వైఎస్ జగన్‌లో ఎలాంటి మార్పు రాలేదని మంత్రి సోమిరెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పరుష పదజాలంతో మాట్లాడి కేసులు పెట్టించుకున్న జగన్ పాదయాత్రలోనూ అదే వైఖరి అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ఒంగోలు ఆయన విూడియాతో మాట్లాడుతూ.. అవినీతి గురించి జగన్ మాట్లాడుతుంటే జనం నవ్వుతున్నారని అన్నారు. జగన్ అవినీతి గురించి ఇంతవరకూ జాతీయస్థాయి వరకే తెలుసని, తాజాగా ప్యారడైజ్ పేపర్ల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఆయన అవినీతి చరిత్రకెక్కిందని వ్యాఖ్యానించారు. బెంగళూరులో 29 ఎకరాల్లో భారీ భవంతిని నిర్మించుకున్న జగన్.. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ప్యారడైజ్ పేపర్స్‌లో జగన్ పేరుండటం అతని అవినీతికి పరాకాష్ట. ప్రపంచంలో ఏ మూల ఏ ఆర్థిక నేరం జరిగినా అందులో జగన్ పాత్ర ఉండడం సర్వసాధారణమైంది. అవినీతిలో నిండా మునిగిన జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎలా విమర్శలు చేస్తారు?’ అంటూ ప్రతిపక్ష నేతపై సోమిరెడ్డి విరుచుకుపడ్డారు. జగన్ పాదయాత్ర చేసినా, మోకాళ్ల యాత్ర చేసినా టీడీపీకివచ్చే నష్టమేవిూ లేదని సోమిరెడ్డి అన్నారు. ‘తనను గెలిపిస్తే రాజన్న పాలన తీసుకొస్తానని జగన్ చెబుతున్నారు. వేల ఎకరాల పేదల భూములను సెజ్‌ల పేరుతో లాక్కొని రైతులను నట్టేట ముంచడమేనా రాజన్న పాలననా అన్నారు. ప్రభుత్వ ఆస్తులను అనుచరులకు తెగనమ్ముకోవడమేనా రాజన్న పాలన? గోదావరి జిల్లాల్లో క్రాప్ హాలీడే ప్రకటించే దుర్భిక్ష పరిస్థితులు తీసుకురావడమేనా రాజన్న పాలనా అంటూ నిలదీశారు. ఎన్నికలకు ముందే జైలుకి వెళ్తానేమోనన్న భయంతో జగన్ పాదయాత్ర నాటకానికి తెరతీశారని దుయ్యబట్టారు. పాదయాత్ర పేరుతో అరాచకాలు సృష్టించాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే వైసీపీ, జగన్ పూర్తి బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. జగన్ పాదయాత్ర వల్ల తమ పార్టీకి, ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదని అన్నారు. ఈ మూడేళ్లలో ఎన్నో హావిూలు నెరవేర్చామని, అందుకే ప్రజలు తమ పార్టీని ఆదరిస్తున్నారని చెప్పారు. పరిణతిలేని నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టమని, అసెంబ్లీ బహిష్కరణ అందుకు నిదర్శనమని సోమిరెడ్డి అన్నారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలను ఎలుగెత్తాల్సిన బాధ్యత కలిగిన ప్రతిపక్షం శాసనసభను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవటం బాధాకరమన్నారు.