Tuesday, 3 November 2026

ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం పోరాడదాం

ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన టిడిపి ప్రభుత్వం

ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాడాలని సిపిఎం నేత పిలుపు

కాకినాడ,నవంబర్‌13(జ‌నంసాక్షి): ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం పోరాడదాం అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మోర్తా రాజశేఖర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం రాజోలు అంబేద్కర్‌ కమ్యూనిటీ భవనంలో వివిధ ప్రజా సంఘల కార్యకర్తలకు అవగాహన తరగతులు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజశేఖర్‌ మాట్లాడుతూ.. టిడిపి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందని, సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, నూతన రాజకీయ ప్రత్యామ్నాయం దిశగా అన్ని ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాడాలని సిపిఎం నేత పిలుపునిచ్చారు. నూతన రాష్టాన్రికి సమగ్రాభివృద్ధి కావాల్సి ఉండగా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి హావిూతో నాలుగున్నరేళ్లు ఊరించిన ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడి చేయడాన్ని తప్పుబట్టారు. ప్రతి ఏడాది డిఎస్సీ ప్రకటిస్తామన్న హావిూని తుంగలో తొక్కిందన్నారు. ఇంకెంత కాలం తాత్కాలిక ఉద్యోగులతో తంతు నడిపిస్‌త్తారని టిడిపి సర్కార్‌ను హైకోర్టు ప్రశ్నించిందని, ఇప్పటికైనా చంద్రబాబు ఉద్యోగ నియమకాలు చేపట్టాలన్నారు. ఉద్యోగాలన్నింటినీ కాంట్రాక్టీకరణ చేస్తున్న ప్రభుత్వానికి ఎపిపిఎస్సీతో పనేముందని ప్రశ్నించారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాని, సామాజిక న్యాయం మంటగలిసిందని విమర్శించారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలపై దాడులు పెరిగాయని, పెదగొట్టిపాడు, గరగపర్రు, చిత్తూరు జిల్లాలో మహా భారతం, విశాఖ మన్యం ఉదంతాలే దీనికి

నిదర్శనమన్నారు. మహిళా ఉద్యోగినులపై ప్రజా ప్రతినిధులే బెదిరింపులకు పాల్పడటం దారుణమన్నారు. టిడిపి ప్రజా ప్రతినిధులు ఇసుక, మద్యం, కాల్‌మనీ వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారని చెప్పారు. ఉత్తరాంధ్రలో విష జ్వరాలతో ప్రజలు మరణిస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్షాల పోరాటంతోనే ప్రభుత్వం హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిందన్నారు. ఆక్వా సాగు వల్ల జిల్లాలో కోనసీమలో తాగునీరు కలుషితమవుతుందన్నారు. టిడిపి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తుంటే వైసిపి ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. పార్టీలు వేరైనప్పటికీ రెండింటి విధానాలు ఒకటేనన్నారు. మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ పెరుగుదలపై ప్రజల నిరసనే దీనికి నిదర్శనమన్నారు. రాజకీయ ప్రత్యామ్నాయంతో బూర్జువా పార్టీలకు తమ తడాఖా చూపించే దిశగా అన్ని ప్రజా సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పోరాటాల్లో కలిసి వస్తున్న ప్రజానీకానికి రాజకీయ విద్యను అందించడం ద్వారా వారిని చైతన్యవంతులను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా నాయుకులు పీతల రామచంద్రరావు, సిపిఎం రాజోలు శాఖ కార్యదర్శి బుంగ సత్యనారాయణ, సిఐటియు నాయకులు కందిగట్ల రామారావు, ఐద్వా డివిజన్‌ కన్వీనర్‌ కందిగట్ల గిరిజ, రాపాక రామకృష్ణ, ఎలుమర్తి రాము, కారుపల్లి గోపాల్‌, బళ్ళ పర్వతాలు, పద్మ పలువురు పాల్గొన్నారు.