ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి సునీత
అనంతపురం, ఆగస్టు 30: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు గార్లదిన్నె మండలం తిమ్మంపేట దగ్ధమైందన్న విషయం తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ తెల్లవారుజామున విజయవాడ నుంచి అనంతపురం వెళ్తున్న ఆమె ప్రమాద ఘటన గురించి తెలుసుకుని వెంటనే అక్కడికి చేరుకున్నారు. అక్కడున్న పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే అనంతపురం సమీపంలోని జాతీయ రహదారిపై ఇస్కాన్ టెంపుల్ వద్ద లారీ-బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందిన విషయం తెలుసుకున్న మంత్రి అక్కడి నుంచి ఇస్కాన్ టెంపుల్ వద్దకు చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గరుండి సమీపంలోని ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.