ప్రేమపేరుతో యువతికి మోసం

యువకుడితో పాటు కుటుంబ సభ్యలుపై కేసు

నెల్లూరు,జూన్‌25(జ‌నం సాక్షి ): ప్రేమ వ్యహారం నడిపి పెళ్లి చేసుకుంటానని యువతిని లోబరుచుకుని పెళ్లికి మొహం చాటేసిన ఘటనలో యువకుడు, అతడి కుటుంబ సభ్యులపై నెల్లూరు బాలాజీనగర్‌ పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన యువతి చెనైలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సంతపేటకు చెందిన నల్లమోలు దివ్యతేజ అనే యువకుడు అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. దాంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. నెల్లూరు నుంచి చెన్నైకు వీరిద్దరూ కలిసి వెళ్లి వస్తుండేవారు. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో దివ్యతేజ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబరుచుకున్నాడు. కొద్దికాలం వీరిద్దరి మధ్య వ్యవహారం కొనసాగింది. అనంతరం ఆ యువతి వివాహం చేసుకోవాలని దివ్యతేజను నిలదీయడంతో చేసుకోనని తేల్చిచెప్పాడు. అనంతరం యువతి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు దివ్యతేజ తల్లిదండ్రులకు కలిసి వారిద్దరికి పెళ్లి చేయాలని విజ్ఞప్తి చేశారు. దివ్యతేజతో పాటు ఆయన తల్లి ఇందిర, సోదరుడు కృష్ణ సందీప్‌ కూడా దివ్యతేజకే వత్తాసు పలికారు. పెళ్లి చేసేది లేదంటూనే చంపుతామని బెదిరించారు. దాంతో బాధితురాలు ఆదివారం బాలాజీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా దివ్యతేజ, ఆయన తల్లి ఇందిర, సోదరుడు కృష్ణ సందీప్‌లపై చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంగమేశ్వరరావు తెలిపారు.