ప్రేమపేరుతో యువతిని మోసం చేసి గర్భవతిని చేశాడు

రంగంలోకి దిగిన ఐసీడీఎస్‌ అధికారులు

యువకుడి కోసం పోలీసుల గాలింపు

నెల్లూరు,జూన్‌21(జ‌నం సాక్షి): ప్రేమికుడి వంచనకు గురైన ఓ యువతి పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది. పసెళ్లి చేసుకుంటానన్న ప్రేమికుడు మొహం చాటేశాడు. దీంతో ఆ యువతి పరువు కాపాడుకునేందుకు గర్భాన్ని తొలగించుకోవడం కోసం గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు రావడంతో వైద్య సిబ్బంది గమనించి ఐసీడీఎస్‌ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఐసీడీఎస్‌ అధికారులు మెరుగైన చికిత్స నిమిత్తం ‘108’లో నెల్లూరుకు తరలించారు. గూడూరు మండలంలోని ఓ ప్రాంతానికి చెందిన యువతి (18)ను గత కొంతకాలంగా ఓ లారీ డ్రైవర్‌ ప్రేమించి వంచనకు గురిచేశాడు. వీరిద్దరూ పరస్పరం సహజీవనం చేశారు. పెళ్లి చేసుకోకుండానే ఆమెతో కాపురం చేశాడు. దీంతో యువతి గర్భం దాల్చింది. కుటుంబ సభ్యులకు, ఇరుగుపొరుగుకు తెలియకుండా చూసుకున్న యువతి తప్పనిసరి పరిస్థితుల్లో గర్భం తొలగించుకునే ప్రయత్నంలో భాగంగా ఒంటరిగా శుక్రవారం కాన్పు కోసం వచ్చానని ఆసుపత్రిలో చేరింది. దీంతో వైద్యులు వివరాలను ఆరా తీసినా సరిగా చెప్పలేదు. మోసపోయానన్న వేదనతో ఓ యువకుడు నమ్మించి గర్భవతిని చేశాడని తనకింకా పెళ్లి కాలేదని చెప్పడంతో వైద్యులు, పురుడు పోసేందుకు ఇరకాటంలో పడ్డారు. దీంతో ఐసీడీఎస్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. యువతి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో వారు నెల్లూరుకు తరలించారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు రంగంలోకి దిగారు. మోసం చేసిన యువకుడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.