Tuesday, 3 November 2026

ఫడ్నావిస్‌ సర్కార్‌కు కౌంట్‌డౌన్‌

Untitled-4

ప్రభుత్వం ఐదేళ్లు ఉండదు

ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌

ముంబై, నవంబర్‌ 18 (జనంసాక్షి) : మహారాష్ట్ర సర్కార్‌కు కౌంట్‌ డౌన్‌ మొదలైందని, ఆ ప్రభుత్వం ఐదేళ్లు ఉండదని ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్‌పవార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. 121 మంది సభ్యులతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ.. ఎన్సీపీ మద్దతుతో అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షను గట్టెక్కిన సంగతి తెలిసిందే. నెల రోజుల క్రితం బీజేపీకి భేషరతుగా మద్దతు ప్రకటించిన ఎన్సీపీ ఇంతలోనే తన వైఖరి మార్చుకోవడం విశేషం. ఫడ్నావిస్‌ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఉంటుందన్న నమ్మకం లేదని శరద్‌ పవార్‌ వ్యాఖ్యానించారు. మంగళవారం రాయ్‌గఢ్‌ జిల్లాలోని అలియాబాగ్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడానికి ఎన్సీపీది బాధ్యత కాదని పవార్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఏ క్షణమైనా మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ‘బీజేపీ మైనార్టీ ప్రభుత్వాన్ని కాపాడతామని హామీ ఇవ్వలేం. మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావాల్సిందే’నని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ బల నిరూపణ సందర్భంగా తమ పార్టీ తటస్థ వైఖరిని అవలంబించిందని తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో మరాఠ గడ్డపై ఎంఐఎం రెండు సీట్లు గెలుచుకోవడంపై పవార్‌ స్పందించారు. అధికార పార్టీలోని ఒక వర్గం ఎంఐఎంకు మద్దతిస్తోందని ఆరోపించారు. ఎంఐఎం వైఖరి పూర్తిగా విభజనవాదమని, ఇది మంచిది కాదని విమర్శించారు. కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని పవర్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు వల్ల తమ పార్టీ నేతలకు అవినీతి మకిలీ అంటుకున్నట్లు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో ఎన్సీపీ 41 సీట్లకే పరిమితమైంది. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ 62 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *