
– కేసీఆర్ అభివృద్ధి నన్ను ఆకర్షించింది
– గుండు సుధారాణి
న్యూఢిల్లీ,అక్టోబర్28(జనంసాక్షి):వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు దేశం పార్టీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి బుధవారం తెలం గాణ సీఎం కేసీఆర్‌ను దిల్లీలో కలిశారు. ఆమె తెరాసలో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సిఎం కెసిఆర్‌ను అభినందించడానికే తాను కలిశానని అన్నారు. దీనిపై ఆమెను విలేకరులు ప్రశ్నించగా మొన్న ప్రధాని మోదీని కలిశానని… అదేవిధంగా కేసీఆర్ దిల్లీలో ఉన్నందున ఆయనను కలిసినట్లు వివరణ ఇచ్చారు. కేసీఆర్ అభివృద్ధి పనులను చూసి తెలంగాణ ఆడపడుచుగా కలిశానన్నారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాలతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నారని కొనియాడారు. అయితే తెరాసలో చేరుతారా? అన్న ప్రశ్నకు మాత్రం వేచిచూడాలంటూ సమాధానం దాటవేశారు. వరంగల్ స్మార్ట్ సిటీగా ప్రకటించేందకు సీఎం కేసీఆర్ చొరవ తీసుకున్నందుకు అభినందించానన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ పథకాలను మిగతా రాష్ట్రాలు స్పూర్థిగా తీసుకుంటున్నాయన్నారు.తెలంగాణ బిడ్డగా సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపానని ఆమె చెప్పారు. అలాగే సీఎం కేసీర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నందున అభినందించానన్నారు. తెలంగాణలో అనేక అభివృద్ది పనులు జరగుతున్నాయని, తెలంగాణ ఆడపడచుగా తాను అభివృద్దిలో పాలుపంచుకోవాలని అనుకుంటున్నానని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోరాటం చేశామని, జైలుకు కూడా వెళ్లామని అన్నారు. ఈ దశలో తెలంగౄణ ఏర్పడ్డ తరవాత అనేక కార్యక్రమాలతో సిఎం కెసిఆర్ ముందుకు సాగుతున్నారని అన్నారు. ఈ ప్రాంత సిఎంగా ఆయనను తాను కలవడంలో తప్పు లేదన్నారు. దీనికిరాజకీయాలు కూడా లేవన్నారు.




