Tuesday, 3 November 2026

బాబుల అవినీతి కూడా బద్దలవుతుంది: ధర్మాన

విశాఖపట్టణం,ఏప్రిల్‌7 :  రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్‌ అవినీతికి పాల్పడుతున్నారని వీరి రంగు కూడా పనామా పేపర్లలో లాగా బయటపడక తప్పదని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు  విమర్శించారు. పెదబాబు,చినబాబుల అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. టిడిపి వారిని జన్మభూమి కమిటీలుగా నియమించి సర్పంచులను అపహాస్యం చేశారని విమర్శించారు. పచ్చజెండా కడితేనే పింఛన్లు ఇస్తున్నారని, రెండేళ్లలో ఒక్క ఇల్లూ ఇవ్వలేదని ఆరోపించారు. రాజధాని అమరావతిలో సామాన్యుడు అడుగుపెట్టలేని విధంగా తయారుచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి కొంటున్నారని

ఆరోపించారు.తెలుగుదేశం ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఈ పరిస్థితుల్లో వైకాపా కార్యకర్తలంతా ప్రజల పక్షాన గొంతు విప్పాలని ఆయన  పిలుపునిచ్చారు.  వైకాపాకి 67 సీట్లతో ప్రజలు ప్రతిపక్ష బాధ్యత అప్పగించారన్నారు. అయితే ప్రతిపక్షం లేకుండా చేయాలని సిఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పాలనపై ప్రజల భ్రమలన్నీ తొలగిపోయాయని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *