బిజెపిపై ఉద్దేశ్యపూర్వక దుష్పచ్రారం

 

బాబు తీరుపై మండిపడ్డ జివిఎల్‌

కావాలనే తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేసే ఎత్తుగడ

పోలవరంలో భారీ అవినీతి జరిగిందన్న కన్నా

టిటిడిపై సిబిఐ విచారాణ జరపాలని డిమాండ్‌

విజయవాడ,జూన్‌4(జ‌నం సాక్షి): కేంద్రంలోని మోదీ సర్కారుపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తోందని భాజాపా జాతీయ అధికార ప్రతినిధి జి.వి.ఎల్‌. నరసింహరావు అన్నారు. కావాలనే దుష్పచ్రారం చేస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మండిప్డడారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణతో కలిసి విజయవాడలో సోమవారం ఆయన విూడియాతోఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవీఎల్‌… గుజరాత్‌ లో డొలెరా సిటీ, పటేల్‌ విగ్రహం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. డొలేరా ప్రాజెక్టుకు కేంద్రం రూ.1,293 కోట్లు మాత్రమే ఇచ్చిందని… కానీ రూ.98వేల కోట్లు ఇచ్చినట్లు ప్రచారం చేయటం సరికాదన్నారు. పారిశ్రామిక నడవాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చిన భూమి విలువకు సమానంగా నిధులివ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. అదే కోవలో కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్‌కు కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. అయితే దీనికోసం 12 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా… ఇప్పటి వరకూ 15వందల ఎకరాలు మాత్రమే పూర్తి చేశారని వివరించారు. భూసేకరణ పూర్తయితే కేంద్ర నిధులు వస్తాయని.. రాష్ట్రం ఆపని చేయకుండా కేంద్రాన్ని విమర్శించటం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొద్ది నెలలుగా బీజేపీపై ఓ పద్దతి ప్రకారం దుష్పచ్రారం జరుగుతోందని జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. నిధులు ఇతర అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి అవాస్తవాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణంలో భాగంగా కేంద్రం రూ.1000 కోట్లు నిధులు కేటాయిస్తే ఇప్పటివరకు కేవలం రూ.230 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును వారు తప్పుబట్టారు. అవినీతి సంపాదనపై దృష్టి తగ్గించి చంద్రబాబు ఇకనైనా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. నరేంద్ర మోదీని మళ్లీ ప్రధానమంత్రి కావాలని ఎన్డీఏ పక్షాల తరఫున 2017 ఏప్రిల్‌ 17న తీర్మానం చేసిన చంద్రబాబు డిసెంబర్‌ నాటికి తన వైఖరి ఎందుకు మార్చుకున్నారని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి ఎన్నో అబద్దాలకు చంద్రబాబు సమాధానం చెప్పుకోవాల్సి ఉందన్నారు. అలాగే విశాఖపట్నం, శ్రీకాళహస్తి పారిశ్రామిక నగరాల్ని సైతం అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలు ఒక్కటి కూడా అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. దాని నుంచి బయటపడేందుకు భాజపా, కేంద్రంపై తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. పోలవరం నిర్మాణం విషయంలో కేంద్రం పూర్తిస్థాయిలో సహకరిస్తున్నా… రాష్ట్రం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల నుంచి వెంకటేశ్వరరావును తప్పించి… తమకు అనుకూలమైన జూనియర్‌ అధికారికి అప్పజెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోందని ఈ సందర్భంగా కన్నా ఆరోపించారు. దొడ్డిదారిలో పదోన్నతి పొందిన అనుభవం లేని అధికారికి పోలవరం నిర్మాణం బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. ఇకపోతే బీజేపీ, వైఎస్సార్‌సీపీకి అక్రమ సంబంధం అంటగట్టి చంద్రబాబు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది చంద్రబాబు అతి తెలివికి నిదర్శనమని దుయ్యబట్టారు. చంద్రబాబు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతూ, ఓ అపరిచితుడిలా మారారని ధ్వజమెత్తారు. ఇతరులపై బురదజల్లి పారిపోయే విధానాలకు చంద్రబాబు ఇకనైనా స్వస్తి చెప్పాలని అన్నారు. తిరుమల దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను పదవి నుంచి తొలగించింది విూరు కాదా అని ప్రశ్నించారు. టీటీడీలో అవకతవకలపై సీబీఐ విచారణకు సిద్ధం కావాలని సవాలు విసిరారు. ఎవరైనా అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే వారిపై పోలీసు కేసులు పెడతారా? కొత్త సంస్కృతిని చంద్రబాబు ప్రవేశ పెట్టారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చేతకానితనంతో ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి వచ్చే నిధులను వాడుకోలేక పోయారని, ప్రాజెక్ట్‌ల కోసం నివేదికలు ఇవ్వాలని కోరినా చంద్రబాబు నాయుడు నుంచి కనీస స్పందన లేదని కన్నా

లక్ష్మీనారాయణ విమర్శించారు.

————-