Thursday, 5 November 2026

బీహార్‌ అభివృద్ధికి మూడు సూత్రాలు

C

– ఎన్నికల ప్రచార సభలో మోదీ

పాట్న  అక్టోబర్‌ 25 (జనంసాక్షి):

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మూడు సూత్రాలు అవలింబించాల్సి ఉంటుందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆదివారం నలంద ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ తనదైనశైలిలో ప్రసంగించారు. బీహార్‌ రాష్ట్రం అభివృద్ధికి మూడు సూత్రాలు అవసరమని, నీరు..విద్యుత్‌..రోడ్లు అభివృద్ధి చెందితే బీహార్‌ కు మహర్ధశ పడుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. నిరంతరం విద్యుత్‌ ఉంటే యువకులు వలసలు పోరని, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు లేక యువత వలస బాటపడుతున్నారని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి వలసలు నివారిస్తామని, బీహార్‌ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని మోడీ మరోసారి స్పష్టం చేశారు. బిహార్‌ను, బిహార్‌ ప్రజలను కాపాడటానికి ప్రజాస్వామ్యం చాలు అని, ఏ తాంత్రికత అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఎన్నికల వేళ బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఓ తాంత్రికుడిని కలిసి.. అతన్ని కౌగిలించుకున్న వీడియో వెలుగుచూసిన నేపథ్యంలో మోదీ ఆయనపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదేవిధంగా ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌పైనా మోదీ విరుచుకుపడ్డారు. లాలూ ఒక తాంత్రికుడని, ఆయన పార్టీ ‘రాష్ట్రీయ జాడు టోనా పార్టీ’ అని విమర్శించారు. బిహార్‌ అభివృద్ధికి ప్రజలు ఈ ఎన్నికల్లో పాలుపంచుకోవడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.మూడో దశ పోలింగ్‌ తేదీ ముంచుకొస్తున్న నేపథ్యంలో  అలాగే యువత, వృద్ధుల కోసం యువత చదువు, యువతకు ఉపాధి, వృద్ధులకు ఆరోగ్యం, వైద్యం పేరిట మరో పథకాన్ని ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను నీరుగార్చబోదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ‘సామాజికంగా వెనుకబడిన బడుగువర్గాలకు బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కల్పించిన హక్కులను తమ ప్రభుత్వం ఎన్నటికీ దూరం చేయబోదు’ అని మోదీ పేర్కొన్నారు. బిహార్‌లో జరుగబోయే తదుపరి మూడు దశల ఎన్నికల్లో అత్యంత వెనుకబడిన తరగతులకు (ఈబీసీ) చెందిన ఓటర్లు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై స్పష్టత ఇవ్వడమే కాకుండా మోదీ ఈబీసీ కార్డును ప్రదర్శించారు. తాను కూడా వెనుకబడిన తరగతులకు చెందిన వాడినని, ఈ వాస్తవాన్ని బీజేపీ వ్యతిరేక కూటమి నేతలైన లాలూ, నితీశ్‌ జీర్ణించుకోవడం లేదని మోదీ పేర్కొన్నారు.గుజరాత్‌లో పటేళ్ల రిజర్వేషన్‌ ఉద్యమం నేపథ్యంలో  బీజేపీ మాతృసంస్థ అయిన ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ రిజర్వేషన్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లపై సవిూక్ష నిర్వహించాలని ఆయన పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో బిహార్‌ ఎన్నికల వేళ బీజేపీ ఇరుకున పడింది. ఇదే అంశంతో ప్రత్యర్థి పార్టీలు బీజేపీపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *