బురద రాజకీయాలు మానుకోవాలి
జగన్ తీరు అభివృద్ది నిరోధకం: జివి
గుంటూరు,జూన్20(జనం సాక్షి): ఆంధ్రుల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లేలా జగన్ వ్యవహారాలు ఉన్నాయని టిడిపి జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు అన్నారు. అమరావతి నిర్మాణం కోసం అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతుంటే దానిని అడ్డుకునేలా జగన్ యాత్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అభివృద్ధికిపట్టిన చీడ పురుగులా జగన్ తయారయ్యారని జివి మండిపడ్డారు. నవ్యాంధ్ర అభివృద్ధిలో భాగంగా దేశ, విదేశాల్లో పెట్టుబడుల కోసం, రాజకీయ నేతలతో, కంపెనీల సీఈవోలతో క్షణం తీరిక లేకుండా సీఎం చంద్రబాబు కృషి చేస్తుంటే దానిని అడ్డుకోవడమే లక్ష్యంగా జగన్ పాదయాత్ర వ్యవహారం ఉందన్నారు. ఏడాదిలోనే ఎన్నికలంటూ ప్రజలను మభ్యపెడుతూ రైతులను రెచ్చగొడుతున్నారని అన్నారు. జగన్.. అదేపసనిగా ముఖ్యమంత్రిపై బురదజల్లే కార్యక్రమం చేపడుతున్నారన్నారు. రాజధాని రాకతో తమ భూముల ధరలు ఎంతగానో పెరిగాయని ఆనందంలో ఉన్న రైతులను.. వివిధ రూపాల్లో రెచ్చగొట్టేందుకుజగన్ ప్రయత్నించడం దురదృష్టకరమని అన్నారు. జగన్ వైఖరి తెలుగు వారికి గౌరవమా అని ప్రశ్నించారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్యభద్రత, ఆహారభద్రత, సాంఘిక, సంక్షేమ భద్రత కల్పించిన ఘనత తెదేపాదేనన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి, రూ.5లకే భోజనం అందిస్తామన్నారు. రూ.15 చెల్లించి, చంద్రన్న బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ఎదగాలన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, రైతులు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. మహిళల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారిత సాధించాలన్నాదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమని పేర్కొన్నారు. మహిళా ఆర్థిక సాధికారితలో భాగంగా ప్రతి మహిళకు రూ.10వేలు పెట్టుబడి నిధి పసుపు కుంకుమ కింద పంపిణీ చేస్తామన్నారు. స్థానిక సంస్థలలో భాగస్వామ్యంతో పాటు మహిళలకు ఆస్తిహక్కు, చట్టసభలలో 33శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్ దక్కుతుందన్నారు.