గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి
హైదరాబాద్, మార్చి 31 : నగరంలోని బోరబండ దేవయ్య బస్తిలో విషాదం నెలకొంది. గత అర్థరాత్రి ఓ ఇంటి గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, దంపతులు గాయపడ్డారు. వెంటనే వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కర్నూలు జిల్లాకు చెందిన రాజు జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు ఉద్యోగా పనిచేస్తున్నాడు. దేవయ్య బస్తీలో నిన్ననే కుటుంబంతో సహా అద్దెకు ఇంట్లో దిగాడు. అయితే నిన్న కురిసిన వర్షానికి బాగా తడిసిన భవనం అంతా నిద్రిస్తున్న సమయంలో కుప్పకూలింది. మృతి చెందిన చిన్నారులు నవ్య(4), చరణ్(2)గా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే నవ్య అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన చరణ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందాడు. అలాగే గాయపడి దంపతుల్లో భర్త కాలు విరిగినట్లు తెలుస్తోంది. భార్య ఇంకా అపస్మారక స్థితిలో ఉందని 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు.




