నగరంలో నయా ఇబ్బందులు మొదలయ్యాయి. మార్పిడి, నగదు డ్రా విషయాన్ని పక్కన పెడితే.. కనీసం తమ ఖాతాల్లో డబ్బులు వేసుకునే అవకాశమూ ఖాతాదారులకు లేకుండా పోతోంది. నగదు లేదంటూ కొన్ని బ్యాంకులు మూసి వేస్తుండడంతో డిపాజిటర్లు గగ్గోలు పెడ్తున్నారు. ఇదేం అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఖాతాల్లో ఉన్న డబ్బు తీసుకోనివ్వరు.. మా వద్ద ఉన్న డబ్బూ వేసుకోనివ్వరా?’ అంటూ మండిపడుతున్నారు. తార్నాకలోని ఆంధ్రా బ్యాంకుకు మూడు రోజులు వరుసగా వెళ్లిన ఖాతాదారుడు.. బ్యాంకు మూసి ఉండటంతో తన వద్ద ఉన్న రూ.1000, 500 నోట్లను డిపాజిట్ చేయలేకపోయాడు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో చాలావరకు నగదు డిపాజిట్లతో నిండుకున్నాయి. దీనికి తోడు బ్యాంకులకు కొత్తనోట్లు తక్కువగా వస్తుండటంతో డిపాజిట్లు తీసుకోలేక, నగదు ఇవ్వలేక, ఖాతదారులకు సమాధానం చెప్పలేక 50 శాతం బ్యాంకులు మధ్యాహ్నానికే మూసివే స్తున్నారు. గురువారం కార్వాన్‌లో ఆంధ్రాబ్యాంక్ తెరుచుకోకపోవడంతో ఖాతాదారులు బ్యాంకుముందు అందోళనకు దిగారు. సీతాఫల్‌మండి ఆంధ్రాబ్యాంకులో శుక్రవారం నగదు లేకపోవటంతో ప్రధానద్వారం మూసి వెనుక డోర్ ద్వారా లావాదేవీలు నడిపించారు. బ్యాంకు ప్రధానద్వారం మూసి ఉండటంతో డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఖాతదారులు సైతం తిరిగే వెళ్లిపోయారు. చిలకలగూడలోని సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో నో విత్‌డ్రా… నో ఏక్సేంజ్ అనేబోర్డులు పెట్టడంతో ఖాతదారులు అవస్థలు పడ్డారు.
బ్యాంకులలో నో మనీ…!!




