మోహినీ రూపంలో అభయమిచ్చిన శ్రీవారు
భారీగా తరలివస్తున్న భక్త జనం
తిరుమల,అక్టోబర్ 4 (జనంసాక్షి): సాలకట్ల బ్ర¬్మత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం ఉదయం శ్రీవారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చాడు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చాడు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, డ్రమ్స్ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ ఊరేగింపు అత్యంత రమణీయంగా జరిగింది. మోహినీ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు. రాత్రి 7 నుంచి 12 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై శ్రీమలయప్పస్వామివారు భక్తులను కటాక్షించనున్నారు. తిరుమలలో బ్ర¬్మత్సవ శోభతో మాడవీధుల్లో నమో వేంకటేశాయ నామస్మరణ మార్మోగుతోంది. తిరుమలకు వేంచేసిన భక్తులు కలియుగ వైకుంఠాన్ని తిలకించి పులకించిపోయారు. సప్తగిరులపై ఉన్న వృక్షాలన్నీ విద్యుత్ దీపాల అల్లికలతో దేదీప్యమానంగా కాంతులీనుతున్నాయి. రంగురంగుల పుష్పాలు, మామిడి తోరణాలు, పచ్చటి అరటి మొక్కలతో భక్తకోటికి స్వాగతం పలికింది. మృదుమధురంగా వినిపిస్తున్న వేదఘోష వీనుల విందు చేస్తోంది. బ్ర¬్మత్సవాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు మెల్లగా తరలివస్తున్నారు. ఓ వైపు బ్రహ్మాండంగా ఉత్సవలను నిర్వహిస్తూనే మరోవైపు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. మొత్తంగా తిరుమల శ్రీవారి వార్షిక బ్ర¬్మత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వాహనసేవకు ముందు కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అశేష భక్తకోటి నుంచి స్వామివారు హారతులందుకున్నారు. వాహనసేవలో శ్రీవారి బ్ర¬్మత్సవాల సంబరం మొదలు కావడంతో వాహన సేవలకు ప్రాధాన్యం ఏర్పడింది. బ్ర¬్మత్సవాల్లో శ్రీవేంకటేశ్వర స్వామి అధిరోహించే ఒక్కొక్క వాహనానికి ఒక్కో చరిత్ర ఉంది. ప్రతి వాహనం నుంచి శ్రీనివాసుడు ఒక్కో సందేశం ఇస్తారు. విశిష్టాద్వైత సిద్దాంతం ప్రకారం భగవంతుడు శేషి. స్వామి శేషవాహనంపై ఊరేగడం ద్వారా భక్తులకు ఈ శేషశేషి సంబంధాన్ని బోధించినట్లు దర్శనం ఇచ్చారు. వేద మంత్రాలతో సేనాధిపతి, అనంత, సుదర్శన, గరుడులను పిలిచి ఆలయ అర్చకులు ప్రసన్నం చేసుకున్నారు. భక్తుల గోవింద నామాలు, ఘనాపాఠీల వేదమంత్ర ఘోషల మధ్య అష్టదిక్పాలకులు, పంచలోకాధిపతులు సాక్షీభూతంగా ఉత్సవాలు సాగుతున్నాయి. ఉత్సవాలకు వేంచేసిన ముక్కోటిదేవతల సమక్షంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఉత్సవాలను కనులారా వీక్షించి తరించాలని భక్తకోటి తిరుమలకు తరలివస్తోంది.




