
– బ్రిటన్‌లో సీఈవోల సమావేశంలో మోదీ
– ప్రధానికి రాణి ఎలిజబెత్ విందు
లండన్,నవంబర్13(జనంసాక్షి): బ్రిటన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ? వివిధ కంపెనీల సీఈవో ల ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. లండన్ లో జరిగిన ఈ సమావేశానికి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ కూడా హాజరయ్యారు. ఇరు దేశాల ప్రధాన కంపెనీల సీఈవోలు ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత్, బ్రిటన్ కంపెనీలు సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించాయి. భారత్ లో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ బ్రిటన్ కంపెనీల సీఈవోలకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహాకారాలు అందిస్తామన్నారు. అంతకుముందు బ్రిటన్ ప్రధానిని కలిసిన మోడీ ఆయనతో నడుస్తూ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోడీ ఓ మొక్కను కూడా నాటారు.
మోదీకి క్వీన్ ఎలిజబెత్ విందు
బ్రిటన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్వీన్ ఎలిజబెత్ అతిథి సత్కారం ఇచ్చారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న మోదీ గౌరవార్థం శుక్రవారం బకింగ్ హ్యామ్ ప్యాలెస్‌లో క్వీన్ ఎలిజబెత్..ఆయనకు విందు ఇచ్చారు. అనంతరం వెంబ్లే స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ఈ సభకు సుమారు 60 వేల
మందిపైగా ఎన్నారైలు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి పెద్ద ఎత్తున ఎన్నారైలు చేరుకున్నారు. అనంతరం మోదీ బ్రిటన్ ప్రధాని కామెరూన్ తో భేటీ అవుతారు. ఇక మూడో రోజు పర్యటనలో భాగంగా మోదీ ఉత్తర లండన్ లో అంబేద్కర్ మెమోరియల్ ను, 12వ శతాబ్దపు తత్వవేత్త బసవేశ్వర విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు.




