Tuesday, 3 November 2026

భారత్‌ బంద్‌లో అరెస్టయిన వారిని విడుదల చేయాలి

విజయవాడ,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఎస్సీ, ఎస్టి అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుకారుస్తూ సుప్రీం కోర్టు

ఇచ్చిన తీర్పును వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలు, దేశవ్యాప్తంగా జరిగిన భారత్‌ బంద్‌ లో అరెస్టు చేసి జైల్లో పెట్టిన వారిని విడుదల చేయాలని కోరుతూ నవంబర్‌ 4న జరుగు దేశవ్యాప్తంగా నిరసనలు జయప్రదం చెయ్యాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవీపియస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి కోరారు. ఈ పిలుపు దేశంలో ఉన్న అన్ని దళిత, గిరిజన, బహుజన, ప్రజా సంఘాలను కలుపుకుని నిరసనలు తెలపాలని దళిత్‌ శోషన్‌ ముక్తి మంచ్‌ జాతీయ సమావేశాలు సందర్భంగా పిలుపునిచ్చారన్నారు. మన రాష్ట్రంలో ఆ పిలుపు లో భాగంగా ఎస్‌ సి, ఎస్‌ టి అత్యాచార నిరోధక చట్టాన్ని 9వ షెడ్యూల్‌ లో చేర్చాలని, బంద్‌ సందర్భంగా ఉత్తరాది రాష్టాల్రలో అనేక మంది దళిత నాయకులు, కార్యకర్తలు, వయసులో పెద్దవాళ్ళు అని తేడా చూడకుండా అరెస్టు చేసి జైల్లో పెట్టిన వారిని విడుదల చేయాలని,దళితులను చంపిన బిజెపి ప్రైవేటు గుండాలను అరెస్టు చెయ్యాలని, డిమాండ్‌ చేస్తూ డియస్‌ యం యం ఇచ్చిన పిలుపు లో భాగంగా రాష్ట్రంలో అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో బహిరంగ సంతకాల సేకరణ చెయ్యాలని కోరారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో, రాష్ట్రంలో దళిత గిరిజనులపై దుర్మార్గమైన దాడులు, అవమానాలు, హత్యలు, సాంఘిక బహిష్కరణలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో ప్రతి దళిత, గిరిజన, బహుజన, ప్రజా సంఘం కలసి రావాలని కోరారు.