Tuesday, 3 November 2026

భువనగిరి కోటపైకి రోప్ వే

3514256భువనగిరి కోట ప్రపంచంలోనే రెండో ఏకశిల కోట. శత్రుదుర్భేద్యంగా నిర్మించారు పశ్చిమ చాళుక్య రాజులు. కాకతీయులు ఏలిన కోట ఇది. 600 అడుగుల ఎత్తులో కళాత్మకమైన ప్రాకారం, కోట తలుపులు, ఆలయాలు, ఉక్కు దర్వాజాలు ఇలా ఎన్నో ఆ కోటపై ఉన్నాయి. దండయాత్రలతో ఆలయాలు, కోటలోని కొంత భాగం ధ్వంసమైనప్పటికీ… తన చారిత్రక విశేషాన్ని కోల్పోలేదు భువనగిరి. ఇక్కడి అందాలను చూడ్డానికి జనం ఎంతగానో ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా యాదాద్రి నరసన్నను చూడ్డానికి వచ్చినవాళ్లైతే… తప్పకుండా భువనగిరిని చూడాలనుకుంటారు. అంతటి విశేషమున్న భువనగిరి కోటను.. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు సర్కార్ జోరుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు ప్రణాళికలు వేసిన సర్కార్.. తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. కోటపైకి వెళ్లడానికి మెట్లు ఉన్నప్పటికీ అంత ఎత్తు చేరుకోవడానికి చాలా శ్రమించాల్సి వస్తుంది. దీంతో రోప్ వే నిర్మించడానికి సిద్ధమవుతోంది. ఐదు కోట్లతో ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ఏడాదిలోగా పూర్తి చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. హైదరాబాద్ –వరంగల్ రహదారికి ఆనుకుని ఉన్న టూరిజం ప్లేస్ లో రోప్ వే స్టేషన్ నిర్మించనున్నారు. మొత్తం 2.36 ఎకరాల్లో ఈ స్టేషన్ ఉంటుందని తెలిపారు అధికారులు. అలాగే కోటపైన స్టేషన్ ఏర్పాటుపై పూర్తిస్థాయి సర్వే చేయనున్నారు. డిజైన్ రూపొందించిన తర్వాత స్థలం ఇవ్వనుంది ప్రభుత్వం. అప్పుడు నేరుగా భువనగిరి కోటపైకి చేరుకోవచ్చు. ఆసక్తి ఉన్న కంపెనీల నుంచి ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు ఈ నెల 25వరకు గడువు ఇచ్చింది ప్రభుత్వం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *