అనంతపురం ,మార్చి25 : జిల్లాలో వివిధ ప్రాజెక్టు పనుల కోసం చేపట్టిన భూసేకరణ నివేదికలను ఈనెల 31 లోగా అందజేయాలని జేసీ లక్ష్మీకాంతం ఆర్డీఓలు, ఎస్‌డీసీలను ఆదేశించారు. హెచ్చెల్సీ ప్రాజెక్టు పరిధిలో సుమారు 600 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. రైల్వే లైను కోసం కళ్యాణదుర్గంలో 29 ఎకరాలు, కంబదూరులో 44 ఎకరాలు భూసేకరణ పెండింగ్‌లో ఉందన్నారు. ప్రాజెక్టు భూసేకరణ, రైల్వేలైన్‌కు భూసేకరణ, పునరావాస కేంద్రాల పురోగతిపై సవిూక్షలో ఆయన ఈ ఆదేశాలు ఇచ్చారు. హంద్రీనీవా ప్రాజెక్టు పరిధిలోని 8వ ప్యాకేజీ కింద లోచర్ల, కప్పలబండ, కమ్మవారిపల్లి, జానకంపల్లి, గొల్లపల్లి, తదితర గ్రామాల్లో భూసేకరణ పనులు అలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ప్రభుత్వం ధర కంటే ఎక్కువ అడుగుతున్నారని, మరి కొన్ని గ్రామాల్లో కాలువ లైను మార్చాలని కోరుతున్నట్లు అధికారులు జేసీ దృష్టికి తెచ్చారు. కదిరి ఆర్డీఓతో కలిసి క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడాలని, భూసేకరణ కొత్త చట్టం ప్రకారం పూర్తిగా రైతులకు వివరించాలన్నారు. ఒప్పుకుంటే ఆ ప్రకారం నివేదికను తయారు చేసి పంపాలని జేసీ సూచించారు. పెద్దపప్పూరు, ఉలికుంటపల్లి, శింగనగుట్టపల్లి, చిన్నఎక్కలూరు, తబ్జుల, పెద్దకోట్ల, దిగువచెర్లోపల్లి, తానాకొత్తపల్లి, చిన్నకోట్ల, మొగలి చెట్లపల్లి గ్రామాల్లోని పునరావాసం కింద 2220 ఇళ్లు మంజూరు కాగా 1480 ఇళ్లు మాత్రమే నిర్మాణాలు పూర్తి చేశారని, మిగిలిన ఇళ్లన్నీ పూర్తి చేయాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. తాగునీరు, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కూడా పూర్తి చేయాలన్నారు.




