Tuesday, 3 November 2026

మగ్గబెట్టడానికి కార్బైడ్‌ వాడితే కఠిన చర్యలు

5

– మంత్రి పోచారం

కార్బైడ్‌ తో పండ్లను మగ్గపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పండ్లను విషపూరితం చేస్తున్న వారి వివరాలు సేకరించేందుకు చర్యలు చేపట్టింది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి వైద్య, మార్కెటింగ్‌, ఫుడ్‌ సెక్యూరిటీ శాఖ అధికారులు ప్రత్యేకంగా సమావేశమై ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు.

కార్బైడ్‌ ను అరికట్టేందుకు రాష్ట్రస్థాయిలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ, జిల్లాలో జేసీలతో, డివిజన్‌ స్థాయిలో ఆర్డీఓలు, మండల స్థాయిలో తహశీల్దార్లతో కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీలు ప్రతి నెల సమావేశాలు నిర్వహించి, కార్బైడ్‌ రహిత పండ్లతో కలిగే అనారోగ్య సమస్యలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి పోచారం ఆదేశించారు.

హైద్రాబాద్‌ లోని పండ్ల మార్కెట్లలో కార్బైడ్‌ వాడకుండా మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించనున్నారు. సెప్టెంబర్‌ 15 తేదీ వరకు ఆయా కమిటీలు ప్రచారం నిర్వహిస్తాయి. కార్బైడ్‌ వాడకంపై నిషేధం గురించి ప్రచారం చేసిన తర్వాత కూడ వాడే దళారులపై చట్టరీత్యాచర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

కార్బైడ్‌ కంటే ఎథిలిన్‌ సహజ వాయువుతో మగ్గబెట్టడంతో కలిగే లాభాలపై ప్రజలకు వివరించాలని మంత్రి పోచారం సూచించారు. ప్రతి ఏటా సెప్టెంబర్‌ మాసాన్ని కార్బైడ్‌ రహిత మాసంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *