Monday, 2 November 2026

మనది అత్యుత్తమ పారిశ్రామిక విధానం

2

నూతన ఇండస్ట్రీయల్‌ పాలసీకి సభ ఆమోదం

హౌజింగ్‌ సొసైటీలు, వక్ఫ్‌ భూముల కబ్జాపై సభాసంఘం

ఎంతటి వారైనా వదిలేది లేదు : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నవంబర్‌ 27 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రానిది అత్యుత్తమ పారిశ్రామిక విధానం అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. పెట్టుబడుదారులను ఆకర్షించేలా, అన్ని రాష్ట్రాల్లో అధ్యయనంచేసి నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించామని స్పష్టంచేశారు. నూతన ఇండస్ట్రీయల్‌ విధానికి గురువారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అలాగే హౌజింగ్‌ సొసైటీలు, వక్ఫ్‌ బోర్డు భూముల కబ్జాపై సభాసంఘం ఏర్పాటుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆక్రమణదారులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తేలేదని సీఎం ప్రకటించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం బిల్లును సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. నూతన పాలసీతో రాష్టాన్న్రి  అద్భుతంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందన్నారు. వాటర్‌గ్రిడ్‌, పరిశ్రమలకు నీటిప్రాజెక్టుల్లోని 10 శాతం నీరు కేటాయిస్తామన్నారు. ఎన్టీపీసీ, జెన్‌కో, భూపాలపల్లి, సింగరేణిలోని ప్రాజెక్టుల వల్ల అదనంగా 2 వేల మెగావాట్ల విద్యుత్‌ వస్తుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో చక్కటి వాతావరణం, మంచి సంస్కృతి ఉందన్నారు. పరిశ్రమలకోసం ప్రత్యేక డిస్కం ఏర్పాటుచేస్తామన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకం కింద రూ. 522 కోట్లను బ్జడెట్‌లో కేటాయించామన్నారు. ఆటోమొబైల్స్‌, జౌళి, చర్మ ఉత్పత్తులు, కాగితం, పాలిమర్స్‌ను ప్రాధాన్య రంగంలో పెట్టామన్నారు. తమకు కల్పిస్తున్న సౌకర్యాలు చూసి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని సీఎం ఆశాభావం వ్యక్తంచేశారు. త్వరలోనే కరెంటు సమస్య లేకుండా పరిష్కరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.  సోలార్‌ విద్యుత్‌ వచ్చేందుకు ఎక్కువ సమయం పట్టదన్నారు. ప్రస్తుతమున్న విద్యుత్‌ సమస్యలు ఏడాదిలోగా పరిష్కారమవుతాయన్నారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి కూడా త్వరలోనే విద్యుత్‌ వస్తుందన్నారు.

2014-15 లో పారిశ్రామికాభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం తీసుకునే చర్యలు

కొత్త ఫార్మా కెమికల్‌ సిటీల ఏర్పాటు, హైదరాబాద్‌- వరంగల్‌ కారిడార్‌ అభివృద్ధి, తెలంగాణ జౌళి నిలయంగా వరంగల్‌ అభివృద్ధి, ఆహార ప్రాసెసింగ్‌, విత్తన ఉత్పత్తికి చర్యలు, పారిశ్రామిక పార్కుతోపాటు టౌన్‌షిప్పులు, దళిత పారిశ్రామికవేత్తలకు నేరుగా రుణ సదుపాయం, పారిశ్రామిక ఉత్పత్తులపై వ్యాట్‌ హేతుబద్ధీకరణ, కార్మిక చట్టాలతోపాటు పారిశ్రామిక నిబంధనల సంస్కరణ, పారిశ్రామిక కార్మికుల రక్షణ కోసం రక్షణ వలయ పథకం, ఇంధన, ఖనిజ, కలప ఆధార పరిశ్రమలు, రవాణా రంగాలకు ప్రాధాన్యం, కొత్త విధానంలో ప్రతి రంగానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు, ప్రతి జిల్లాలో మహిళల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కులు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల మద్దతు కోసం టి-ప్రైడ్‌ కార్యక్రమం, సంప్రదాయ కళలు-హస్తకళల అభివృద్ధి కోసం టి-హార్ట్‌, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి టి- ఇండియా కార్యక్రమం. బిల్లుపై తమకు అనేక అభ్యంతరాలు ఉన్నాయని కాంగ్రెస్‌ శాసన సభ్యురాలు గీతారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాజెక్టు, ఆమోద స్వయంధ్రువీకరణ బిల్లుపై శాసనసభలో జరుగుతున్న చర్చలో ఆమె మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పారిశ్రామికవేత్తల వివరాలు పూర్తిగా తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం అనేక నకిలీ ధ్రువపత్రాలు పుట్టుకొస్తున్నాయని ఆమె తెలిపారు. ప్రస్తుతమున్న సహ చట్టం అమలుచేసేందుకు కమిషనర్లు ఉన్నారన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలే మన రాష్ట్ర రాయబారులన్నారు. పారిశ్రామిక విధానం అధికారులను భయపెట్టేదిగా ఉండకూడదన్నారు. పరిశ్రమల సాధనలో ప్రభుత్వం సఫలీకృతం అవుతుందని ఆశిస్తున్నట్లు గీతారెడ్డి తెలిపారు.గతంలో భూకేటాయింపుల్లో అనేక పొరపాట్లు జరిగాయని, ఏ అవసరం కోసం భూమి తీసుకుంటున్నారో ప్రభుత్వం పర్యవేక్షించాలని తెదేపా శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తెలంగాణ శాసనసభలో పారిశ్రామికవిధానంపై చర్చలో మాట్లాడుతూ ఆయన ప్రభుత్వం చేసే మంచిపనులకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. బడుగు, బలహీన వర్గాల్లోని పారిశ్రామికవేత్తలను కూడా ప్రోత్సహించాలన్నారు. చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు.

హౌసింగ్‌ సొసైటీలు, వక్ఫ్‌ భూముల కబ్జాలపై సభాసంఘం ఏర్పాటు

తెలంగాణలోని అన్ని హౌసింగ్‌ సొసైటీలు, వక్ఫ్‌ భూముల ఆక్రమణలపై సమగ్ర విచారణకు సభాసంఘం ఏర్పాటు చేస్తున్నట్లు శాసన సభ స్పీకర్‌ మధుసూధనా చారి ప్రకటించారు. భూ కబ్జాలపై ఎటువంటి విచారణకైనా  ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు స్పష్టం చేశారు. టీఎన్జీవోలతో పాటు అన్ని హౌసింగ్‌ సొసైటీల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరగాల్సిందేనన్నారు. ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని కేసీఆర్‌ పేర్కొన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు. గురువారం శాసనసభలో ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్‌ లేవనెత్తిన వక్ఫ్‌భూములు, సొసైటీల్లో అక్రమాల అంశంపై సీఎం కేసీఆర్‌ సభకు సమాధానం ఇచ్చారు. సొసైటీల్లో అక్రమాలు జరిగాయనటంలో ఎలాంటి సందేహం లేదన్నారు. వక్ఫ్‌ భూములు, వాటి పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. వక్ఫ్‌పై ట్రైబ్యునల్‌కు న్యాయమూర్తిని నియమిస్తామన్నారు. వక్ఫ్‌ ట్రైబ్యునల్‌కు న్యాయమూర్తికి జ్యుడీషియల్‌ అధికారాలు కలిపించాలని ,ఈ మేరకు వక్ఫ్‌ ట్రైబ్యునల్‌ చట్టాన్ని మార్చాల్సిందిగా కేంద్రానికి లేఖ రాసినట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు. బంజారాహిల్స్‌లో బంజారాల కోసం రెండు బంజారా భవనాలు నిర్మిస్తామని తెలిపారు. సీఎం ప్రతిపాదన మేరకు రాష్ట్రంలోని అన్ని హౌసింగ్‌ సొసైటీలు, వక్ఫ్‌భూములపై సభాసంఘం వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు.అంతకుముందు ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ, సొసైటీలకు భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్నారు. ఈ అంశంపై రూల్‌ 74 కింద భూముల కేటాయింపుపై స్పీకర్‌ కు నోటీసు ఇచ్చారు. సభాపతి మధుసూధనా చారి అనుమతితో అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ… జూబ్లీహిల్స్‌, నందగిరిసొసైటీ తదితర సంస్థలకు భూ కేటాయింపులపై సమాచారం ఇవ్వాలని కోరారు. సొసైటీలకు భూ కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఫిల్మ్‌నగర్‌ భూ కేటాయింపుల్లోనూ అక్రమాలు జరిగాయన్నారు. గృహ నిర్మాణ సొసైటీలకు వక్ఫ్‌ భూములు కూడా కేటాయించారని సభ దృష్టికి తెచ్చారు. 208 ఎకరాల భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్నారు. రాష్ట్రమంతటా వక్ఫ్‌ భూములు కబ్జాలకు గురవుతున్నాయన్నారు. కొన్ని చోట్ల వక్ఫ్‌, కొన్నిచోట్ల ప్రభుత్వ స్థలం అంటున్నారు…. సొసైటీకు భూ కేటాయింపులపై ప్రభుత్వ వివరణ సక్రమంగా లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రకటనలోనూ సర్వే నెంబర్లు ఇవ్వలేదన్నారు. ఫిల్మ్‌నగర్‌ సొసైటీలో అక్రమాలు జరిగినట్లు విచారణ అధికారి చెప్పారు. విచారణ అధికారి నివేదికను ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. దీనిపై సీఎం స్పందిస్తూ వక్ఫ్‌ భూముల ఆక్రమణలపై విచారణకు సభాసంఘం నియమించేందుకు అభ్యంతరం లేదన్నారు. అనంతరం కాంగ్రెస్‌ సభ్యలు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ… సొసైటీల్లో అక్రమాలపై విచారణకు సభాసంఘం ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. జూబ్లీహిల్స్‌ సొసైటీలో అన్ని రకాల విచారణ జరిగినట్లు ప్రభుత్వం చెప్పింది, టీఎన్జీవో సొసైటీపైనా చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *