గంగదేవిపల్లి స్పూర్తితో ఆ గ్రామ ప్రజలు ఒక్కటైయ్యారు..ఊరిని పరిశుభ్రంగా చేసేందుకు చిన్నాపెద్ద ఏకమయ్యారు. దీంతో పల్లె రూపరేఖలే మారిపోయాయి. శుభ్రం అవార్డుతోపాటు…నిర్మల్ పురస్కారాన్ని సొంత చేసుకున్నారు. సంపూర్ణ మద్య నిషేధం, వంద శాతం అక్షరాస్యత..ప్రతి ఇంటికి మరుగుదొడ్డితో జిల్లాలో ఆదర్శంగా నిలిచిన రఘునాధపల్లి మండలం, మాదారం గ్రామంపై ప్రత్యేక కథనం.
రాష్ట్రంలోని గ్రామాలకు వరంగల్ జిల్లా రఘునాధపల్లి మండలం మాదారం ఆదర్శంగా నిలుస్తున్నది. గంగదేవి పల్లి ప్రజలను స్పూర్తిగా తీసుకొని గ్రామ ప్రజలంతా ఒక్కటయ్యారు. 2004 నుంచే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నడుంబిగించారు. ఊరు ఊరంతా ఏకమవడంతో మాదారం గ్రామం అద్దంలా తయారైంది. దీనికి తోడు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం పైనా ప్రజల్లో చైతన్యం వచ్చింది. గ్రామస్థులంతా వెంటపడి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకునేలా ఒత్తిడి తెచ్చారు. దీంతో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం చేసుకున్నారు.
గ్రామంలో పూర్తి స్థాయి అక్షరాస్యతతోపాటు..సంపూర్ణ మద్యపాన నిషేధం కొనసాగుతుంది. బెల్టు షాపులు కాని..గుడుంబా అమ్మే వారు కాని ఈ గ్రామంలో కనిపించరు. గుడుంబా అమ్మితే 10 వేలు, తాగిన వ్యక్తికి 500 రూపాయలు పెనాల్టీ వేయాలని గ్రామస్థులు నిబందన పెట్టుకున్నరు. మరోవైపు మంచి నీటి కోసం స్వచ్ఛంద సంస్థల సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించుకున్నారు. ఏటిడబ్ల్యూ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందుతుంది. ఇక ప్రభుత్వ నిధుల తోపాటు గ్రామస్థులు సొంత నిధులతోనూ అభివృద్ధి పనులు చేసుకుంటున్నారు. స్కూల్ కు మట్టి రోడ్డు వేయడం.. గ్రామ పంచాయితీని బాగు చేసుకోవడం వంటి చిన్నచిన్న పనులు చేసుకుంటున్నారు. గ్రామంలో మొత్తం 29 మహిళా సంఘాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఇంటి పన్నులు సైతం గ్రామపంచాయితీకి విధిగా చెల్లిస్తూ..గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నరు.
మరోవైపు గ్రామ జ్యోతిలో భాగంగా మాదారం గ్రామానికి రెండు కోట్ల నిధులు రానున్నాయి. గ్రామ కమిటీలు గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ప్రతి శుక్రవారం కమిటిల పనితీరును సమీక్షిస్తారు. కమిటిలోని సభ్యులు సరిగా పని చేయకపోతే వారిని తొలగించి సక్రమంగా విధులు నిర్వహించే వారికి అవకాశం ఇస్తారు. గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేస్తుండటంతో ప్రజలంతా ఒకే మాట మీద నిలుస్తున్నారు.
గ్రామస్థులంతా కలిసికట్టుగా ఒక్కతాటిపై నిలబడి ఊరిని అభివృద్ధి చేసుకుంటున్న తీరును ప్రతీ ఒక్కరు అభినందిస్తున్నరు. మాదారం బాటలోనే నడిచి తమ గ్రామాలను బాగు చేసుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నరు.
మరుగుదొడ్ల నిర్మాణంలో ఆ ఊరు నెం.1




