మరుభూమిగా కేదార్‌నాథ్‌

శిథిలాల కిందే శవాలు
వేయి దాటిన మృతులు
వేల సంఖ్యలో యాత్రికులు గల్లంతు
ప్రాణాలతో ఉన్నవారినే తరలింపు
రెండు రోజుల్లో వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరిక
సాయం కోసం చూస్తున్న వారు వేలల్లో
రెండేళ్లపాటు యాత్ర రద్దు
నలభై వేల చ.కి.మీ.లలో విపత్తు
ఉత్తరాఖండ్‌ సీఎం బహుగుణ
డెహ్రడూన్‌, జూన్‌ 22 (జనంసాక్షి) :
భక్తుల రద్దీతో కోలాహలంగా ఉండే కేదార్‌నాథ్‌ మరుభూమిగా మారింది. భారీగా విరిగిపడిన కొండ చరియల శిథిలాల కిందే ఎక్కువ సంఖ్యలో శవాలు చిక్కుకుపోయాయి. అధికారికంగా మృతుల సంఖ్య వేయి దాటింది. ఇంకా శిథిలాల కింద ఎన్ని మృతదేహాలున్నాయో లెక్క తెలియని పరిస్థితి. శైవ క్షేత్ర పరిసరాలన్నీ శవాలతో నిండిపోయాయి. వేల సంఖ్యలో యాత్రికుల జాడ తెలియకుండా పోయింది. భారత సైన్యం 18 వేలకు మందికి పైగా యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించగా, ఇంకా 14 వేల మంది జాడ తెలియకుండా పోయినట్లు సమాచారం. సైన్యం ప్రాణాలతో ఉన్నవారిని మాత్రమే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా, మృతదేహాల గురించి పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. గంగమ్మ జల ప్రళయంతో తుడిచిపెట్టుకుపోయిన కేదార్‌నాథ్‌ యాత్ర సుదీర్ఘ కాలం నిలిచిపోనుంది. ఈ శైవ క్షేత్రాన్ని పునర్‌నిర్మించేందుకు మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు కేదర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. భారీ వరదలు ముంచెత్తడంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపింది. ఇప్పటివరకు 556 మృతదేహాలను శిథిలాల కింది నుంచి వెలికితీసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ శనివారం వెల్లడిరచారు. ఇంకా చాలా మృతదేహాలు శిథిలాల కింద ఉన్నాయని, వాటిని తరలించేందుకు చాలా సమయం పడుతుందని చెప్పారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని తరలింపు కొనసాగుతోందని, ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో 15 రోజుల సమయం పడుతుందన్నారు. హిమాలయాల చరిత్రలో ఇంతటి విపత్తు ఎప్పుడూ లేదని పేర్కొన్నారు. భారీ వరదలతో కేదార్‌నాథ్‌ పూర్తిగా తుడుచుపెట్టుకు పోయిందని, పునర్‌నిర్మించాలంటే చాలా రోజులు పడుతుందన్నారు. రెండేళ్ల వరకు కేదార్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పుణ్యక్షేత్రమంతా బురదమయంగా మారిందని, ఎక్కడికక్కడ మృతదేహాలు గుట్టల్లా పేరుకుపోయాయన్నారు. మృతుల సంఖ్య భారీగానే ఉందన్నారు. భారీ వర్షాలకు తమకు ముందస్తు సమాచారం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సముద్ర మట్టానికి 40 వేల చదరపు కిలోమీటర్ల ఎత్తులో ఈ విపత్తు సంభవించిందని తెలిపారు.
48 గంటలు కీలకం…
సైన్యం, ఐటీబీపీ సహా ఇతర సహాయక బృందాలు వరదల్లో చిక్కుకున్న వారిని తరలింపులో తలమునకలయ్యాయి. సైన్యం, ఐటీబీపీ, ఆర్మీ వేర్వేరు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. కొండ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అయితే, ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోంది. అయితే, రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. వర్షాలు నిలిచి వరద తగ్గుముఖం పట్టడం, రెండ్రోజుల కిందట వాతావరణం సహకరించడంతో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. వరదల్లో చిక్కుకున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మళ్లీ వర్షాలు కురిస్తే, సహాయక చర్యలకు అంతరాయం కలుగుతుందని ఆందోళన చెందుతున్నారు. మరో 48 గంటలు చాలా కీలకమని పేర్కొంటున్నారు. కాలంతో పోటీపడి సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని ఐటీబీపీ చీఫ్‌ అజయ్‌ చద్దా తెలిపారు. కేదార్‌నాథ్‌ చుట్టుపక్కల ఇంకా వెయ్యి మంది చిక్కుకున్నారని చెప్పారు. అక్కడికి చేరుకోవడం ప్రతికూలంగా మారిందని తెలిపారు.
పొంచి ఉన్న ప్రమాదం..
వరదల నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారికి మరో ప్రమాదం పొంచి ఉంది. నాలుగైదు రోజులుగా తిండి తిప్పల్లేకుండా, తాగేందుకు నీరు దొరక్క వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న పలువురు యాత్రికులు ఆకలితో అలమటిస్తున్నారు. అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. ఆకలి, అనారోగ్యంతో మృతి చెందుతున్నారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిలో చాలా మంది ఆకలితో, అనారోగ్యంతో ఇప్పటికే మృత్యువాత పడ్డారని సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు, కేదార్‌నాథ్‌ డ్యామ్‌ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి పొగమంచు దట్టంగా అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిరది. మిగిలిన ప్రాంతాల్లో వైమానిక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇంధన కొరత
వరద బాధితుల సహాయక కార్యక్రమాల్లో ఇంధన కొరత పెద్ద సమస్యగా మారింది. వరదల కారణంగా రోడ్డు రవాణా మొత్తం తుడిచిపెట్టుకుపోవడంతో.. ఆయిల్‌ ట్యాంకర్ల ద్వారా ఇంధన సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో వరదల్లో చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు రంగంలోకి దిగిన 45 హెలీక్యాప్టర్లకు ఇంధన కొరత పెద్ద సమస్యగా మారింది. ఇంధనం కోసం ప్రతీసారి డెహ్రాడూన్‌కు హెలీక్యాప్టర్లను తరలించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రతి ట్రిప్‌కు 45నిమిషాల సమయం వృథా అవుతోంది. ఈ కారణంగా డెహ్రాడూన్‌కు దూరంగా ఉన్న గంగోత్రి, కేదార్‌నాథ్‌లలో చిక్కుకుపోయిన వారి తరలింపు ఆలస్యమవుతోంది.