దేశం సుభీక్షంగా ఉండాలి – ప్రధాని నరేంద్ర మోడీ
హైదరబాద్,జూన్ 28 (జనంసాక్షి):
దేశంలో మరో హరిత విప్లవం రావాలని, శాస్‌ీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా దాన్ని సాధించవచ్చని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆదివారం ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఐఏఆర్‌ఐ)కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ‘మన దేశంలో రైతులకు సరైన విత్తనాలు, నీటిపారుదల, విద్యుత్ సరఫరా అందడం లేదు. అవన్నీ సక్రమంగా అందించినప్పుడే రైతుల జీవితాలు మారతాయి. ప్రభుత్వం ఇందుకు కృషి చేస్తోంది. మనది వ్యవసాయ ప్రధాన దేశం. తొలి హరిత విప్లవం వచ్చి చాలా ఏళ్లు గడిచాయి. కానీ ఇప్పుడు మళ్లీ సమయం వచ్చింది. దేశంలో రెండో హరిత విప్లవానికి సమయం ఆసన్నమైంది. కానీ అందుకు ఆస్కారం ఎక్కడుంది. ఝార్ఖండ్ పరిస్థితిని చూస్తేనే అది అర్థమవుతోంది. ఇప్పుడు భారత్‌లో రెండో హరిత విప్లవానికి అవకాశం ఎక్కడ ఉందంటే… ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, పశ్చిమబంగ, అసోం తదితర ప్రాంతాల్లోనే అది సాధ్యమవుతుంది. అందుకే మా ప్రభుత్వం ఈ ప్రాంత వికాసానికి పూర్తి ప్రాధాన్యం ఇస్తోంది’ అని పేర్కొన్నారు.





