మహానాడుకు ప్రత్యేక పాసులు అక్కర్లేదు

విజయవాడ,మే25(జ‌నంసాక్షి): మహానాడుకు వచ్చే వారికి ఎలాంటి పాస్‌లు అక్కర్లేదని టిడిపి స్పష్టం చేసింది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో విజయవాడ వేదికగా జరిగే మహానాడుకు ఎలాంటి పాసులు లేవని తెదేపా జాతీయ కార్యాలయ కార్శదర్శి టీడీ జనార్ధన్‌ తెలిపారు. కార్యకర్తల సభ్యత్వ కార్డులనే వారి పాసులుగా పరిగణిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి సహా అంతా సభ్యత్వ నమోదు కార్డులతోనే మహానాడుకు వస్తారని వెల్లడించారు. సభ్యత్వ నమోదు కార్డులు మర్చిపోతే వారికి వెంటనే ఆన్‌లైన్లో అందచేసే ఏర్పాటు మహానాడు ప్రాంగణం వద్దే చేసినట్లు వెల్లడించారు. సభ్యత్వం లేకుండా మహానాడుకు వచ్చే అభిమానులుంటే వారి ఓటర్‌ కార్డు నెంబర్‌ చెప్పినా అక్కడికక్కడే సభ్యత్వం ఇస్తామని తెలిపారు. 24 కౌనీటర్లు నమోదుకు, 18 కౌనీటర్లు కొత్తగా వచ్చిన వారికి, సభ్యత్వ కార్డు మర్చిపోయిన వారికి ఏర్పాటు చేశామని తెలిపారు.