అసెంబ్లీ సమావేశాలపై జరుగుతున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. మార్చి 8 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2017-2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను మార్చి 11న ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. కనీసం 18 రోజులపాటు సమావేశాలను నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు లేకుండా కొత్త తరహాలో రూపు దిద్దుకుంటున్న బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి మరింత ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నది.
బడ్జెట్‌లో కొత్త పద్దులకు చోటు కల్పిస్తూ ప్రగతి పద్దు, నిర్వహణ పద్దులను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. అదే సమయంలో బడుగు , బలహీన వర్గాల సంక్షేమానికి దోహదపడేలా ప్రజాసంక్షేమ పథకాలకు పెద్దపీట వేయటంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. విద్యా, వైద్యం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కేటాయింపులను ప్రభుత్వం మరింత పెంచనుంది. దీంతో గత ఏడాది 1.3 లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్..ఈసారి 1.45 లక్షల కోట్లకు పెరగనున్నట్టు సమాచారం. గత బడ్జెట్‌లో విద్యా, వైద్యం ప్రజాసంక్షేమానికి 38 వేల కోట్ల రూపాయలు కేటాయించిన సర్కారు ఈసారి ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచే అవకాశం ఉంది
ఈసారి బడ్జెట్‌లో షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళిక పద్దు పూర్తిగా కొత్త రీతిలో ఉండనున్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధులను ప్రత్యేక అభివృద్ధి నిధి ఖాతా కింద చేర్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఎస్సీ,ఎస్టీలకు కేటాయించిన నిధుల్లో పైసా కూడా పక్క దారి పట్టకుండా పక్కాగా ఖర్చు పెట్టడానికి , అవసరమైతే ఎక్కువ నిధులను సమకూర్చడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈమేరకు ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టానికి సవరణ చేయాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా రెండు మంత్రి వర్గ ఉపసంఘాలను నియమించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూపొందించిన చట్టంలోని లొసుగులను సవరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.





