మీరిస్తమన్న తెలంగాణ ఇవ్వండి డిసెంబర్‌ తొమ్మినే విడాకులు

వేరు కాపురాలకు అనుమతివ్వండి
కళ్లులేని చిదంబరం కాంగ్రెస్‌ నేతలు పగటివేశగాళ్లు
గోదావరిఖని, సెప్టెంబర్‌ 2, (జనం సాక్షి) :
కాంగ్రెస్‌ ఎంపీలు పులి వేషగాళ్లని, తెలంగాణ అంశాన్ని తమ నాయకత్వం ముందు పెట్టడానికి నానా నాటకాలు ఆడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఉద్ఘాటించారు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ ప్రక్రియపై గత ఎనిమిదేళ్ల క్రితమే కేంద్రంలో నిశ్చితార్థం జరిగిందని… ఇక రాష్ట్ర ఏర్పాటే తరువాయని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్ర హొంమంత్రి చిదంబరం కళ్ళు లేకుండా గుడ్డిగా వ్యవహరిస్తున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అన్నారు. భారత కమ్యూనిస్ట్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతనెల 25 నుంచి చేపట్టిన ప్రజాపోరు యాత్రలో భాగంగా ఆదివారం గోదావరిఖని పోచమ్మ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు తమ అధిష్టానం వద్ద పిల్లి చేష్టలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఇప్పటివరకు 800మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, విద్యార్థుల ఆత్మహత్యలతో కాంగ్రెస్‌ నాయకులు రాజకీయం చేస్తూ తమ పబ్బం గడుపుకుంటూ పదవులను కాపాడుకోవడం కోసమే ఆరాటపడుతున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మేధావులు, విద్యార్థులు కార్మికులు, రైతులు, గిరిజనులు, పిల్లలు, పెద్దలందరూ ఏకమై పోరాడుతుంటే, కేంద్రం మాత్రం తెలంగాణ ప్రాంతంలోని అన్ని రాజకీయ పక్షాలు ఒక్కటై తమ అభిప్రాయాలను తెలపాలనడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం కొరకు అన్ని పార్టీల నాయకులు ఏకమవుతుంటే టీ కాంగ్రెస్‌ నాయకులు మాత్రం తమ పదవులను కాపాడుకోవడం కోసం అధిష్టానం వద్ద భజన చేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కాంగ్రెస్‌కు ఒక్క మన రాష్ట్రం నుంచే 31 మంది ఎంపీలు ఉన్నారని, వీరంతా ఏకమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై అధిష్టానం వద్ద ఒత్తిడి తీసుకువస్తే తక్షణమే తెలంగాణ ఏర్పాటు ఖాయమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోనియాగాంధీ మెప్పు పొందడం కోసం తెలంగాణ ప్రాంతంలోని వనరులను ఈ ప్రాంత ప్రజలకు దక్కకుండా చేస్తూ తెలంగాణ ఉసురు పోసుకుంటున్నాడన్నారు. సకల జనుల సమ్మెలో అన్ని పక్షాల వారు ఏకమై సమ్మె చేసి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారన్నారు. రెండు కళ్ళ సిద్దాంతాన్ని నమ్మిన టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ ఏర్పాటుపై మనసు మార్చుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ఓటు వేయాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చేది మేమే.. తెచ్చేది మేమే అన్న కాంగ్రెస్‌ నాయకులు పండుగలు, పబ్బాల పేరిట తెలంగాణ ఏర్పాటుకు అడ్డుకట్టగా తయారవుతున్నారన్నారు. ఏ పార్టీ అయిన కూడా ప్రజలతో మమేకమై ప్రజాభిప్రాయాలు తెలుసుకుని, వారికి అనుగుణంగా నడుచుకుంటూ మెదలాలని ఆయన హితవు పలికారు. ఇప్పటికైనా టీ కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ కోసం పోరాటాలు చేస్తున్న అన్ని పార్టీల నేతలతో కలిసికట్టుగా ఉంటూ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, దాని అనుబంధ సంఘాల నాయకులు గుండ మల్లేష్‌, సాంబశివరావు, మర్రి వెంకటస్వామి, చాడ వెంకట్‌రెడ్డి, వాసిరెడ్డి సీతారామయ్య, పల్ల వెంకట్‌రెడ్డి, వై.గట్టయ్య, నారాయణ, గౌతం గోవర్థన్‌, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, పాతిపల్లిఎల్లయ్య, కోరుకంటి చందర్‌లతో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.