Tuesday, 3 November 2026

మూడేళ్ల వరకు ఆదాయపు పన్ను ఉండదు

C

– యువతే ఉద్యోగాలు సృష్టించాలి

– ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ,జనవరి16(జనంసాక్షి):మూడేళ్ల వరకు ఆదాయపు పన్ను ఉండదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.  యువతను ఉద్యోగ సృష్టికర్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వినూత్న ఆలోచనలతో సంస్థలు ఏర్పాటు చేసే వారిని ప్రోత్సహిస్తామని అన్నారు. శనివారం సాయంత్రం ‘విజ్ఞాన్‌ భవన్‌ లో స్టార్టప్‌ ఇండియా’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 35 లక్షల మంది యువతకు లబ్ది చేకూర్చేలా ఈ పథకాన్ని రూపొందించినట్టు చెప్పారు. వచ్చే బడ్జెట్‌ లో స్టార్టప్‌ ఇండియాకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హావిూయిచ్చారు. వ్యాపార రంగంలో యువతను మరింత ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. కొత్తగా ఆలోచించే వాళ్లే చరిత్రను తిరగరాస్తారని అన్నారు. విజయం సాధించిన వారి కంటే అపజయాలు ఎదురైన వారినే ఎక్కువగా సమర్థిస్తానని చెప్పారు. నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడమే అంకుర భారత్‌ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యువ వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించడంపై మార్గసూచీ విడుదల చేశారు. యువతను ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. స్వయం ఉపాధి, స్వావలంభన ప్రోత్సాహం దిశగా కేంద్రం అడుగు వేసిందని.. 35 లక్షల మంది యువతకు లబ్ధి చేకూర్చేలా పథకం రూపకల్పన చేశామని వెల్లడించారు. వినూత్న ఆలోచనలతో సంస్థలు ఏర్పాటుచేసే వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. యువత ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు.. ఎన్నో కలలు కంటున్నారు.. వాటిని సాకారం చేసే మార్గం వారికి లభించడం లేదని మోదీ అన్నారు. స్టార్టప్‌ ఇండియా.. కొత్త ఆలోచనలు చేసి ఉద్యోగాలు సృష్టించే యువత కోసమని పేర్కొన్నారు. స్టార్టప్‌లు వేలకోట్ల డబ్బులు ఉన్నవాళ్లు, బ్యాంకు బ్యాలెన్సులతో చేసేవి కావని అన్నారు. ప్రజల కష్టనష్టాలను దూరం చేసేవి.. సేవలను సులభతరం చేసేవి స్టార్టప్స్‌ అని చెప్పారు. ప్రపంచంలోని పేద దేశాలకు అతి తక్కువ ధరతో వ్యాక్సిన్లు ఇచ్చే దేశం భారత్‌ అని.. భారతీయ మేధావులు, నిపుణుల ఆలోచనల నుంచి పుట్టిందే ఈ తక్కువ ధర వ్యాక్సిన్‌ అని అన్నారు. స్టార్టప్‌ అంటే మిలియన్‌, బిలియన్‌ డాలర్ల పెట్టుబడి కాదని.. ఐదుగురు, పది మందికి ఉపాధి కల్పించేది కూడా స్టార్టప్పేనని పేర్కొన్నారు. మేకిన్‌ ఇండియా అంటే భారత్‌లో తయారీ మాత్రమే కాదు.. భారత్‌ కోసం ఉత్పత్తి చేసే మేక్‌ ఫర్‌ ఇండియా అని వివరించారు. ఏటా రూ. 2,500 కోట్లు ఖర్చు చేసే విధంగా రూ.10 వేల కోట్లతో స్టార్టప్‌ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశామని మోదీ తెలిపారు. స్టార్టప్‌లకు పన్నుల రాయితీలు, మూల ధన లాభ పన్నులో రాయితీ.. మరెన్నో సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. స్టార్టప్‌లకు మూడేళ్లపాటు ఆదాయపన్ను మినహాయింపు ఉంటుందని తెలిపారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే…

విజ్ఞాన్‌ భవన్‌ లో ఇలాంటి సమావేశాలు ఎన్నో జరిగాయి కానీ ఈ సభ శక్తితో నిండివుంది.

కొత్తగా ఆలోచించేవాళ్లను ప్రజలు పిచ్చివాళ్లు అంటారు కానీ అలాంటివాళ్లే చరిత్రను తిరగరాస్తారు

స్టార్టప్స్‌ వేలకోట్లు డబ్బున్నవాళ్లు, బ్యాంకు బ్యాలెన్స్‌ లతో చేసేవీకావు

కష్టనష్టాలను దూరం చేసేవి, సేవలను సులభతరం చేసేవీ స్టార్టప్స్‌

పేద దేశాలకు తక్కువ ధరకు వ్యాక్సిన్లు అందిస్తున్న దేశం మనదే

భారతీయ మేధావుల, నిపుణుల ఆలోచనల నుంచి పుట్టిందే ఈ తక్కువ ధర వ్యాక్సిన్‌

మేక్‌ ఇన్‌ ఇండియా అంటే భారతీయ తయారీ మాత్రమే కాదు భారత్‌ కోసం ఉత్పత్తి చేసే మేక్‌ ఫర్‌ ఇండియా

ఐదుగురు, పది మందికి ఉపాధి కల్పించేది కూడా స్టార్టపే

స్టార్టప్‌ అంటే బిలియన్‌, మిలియన్‌ డాలర్ల పెట్టుబడి కాదు

కొండకోనల్లో ఉన్న విద్యార్థులకు కూడా ధనవంతుల విద్య అందాలి

సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే మారుమూల పల్లెల్లోని విద్యార్థులకు అత్యున్నత విద్య అందుతోంది

అన్నిటికంటే మనముందున్న అతిపెద్ద సవాల్‌ సామాన్యుల ఆరోగ్యం

ఐటీ విజ్ఞానంలో గొప్ప ప్రగతి సాధించాం కానీ ఇంకా ఉద్యోగాలే చేస్తున్నాం

ఇంత ప్రగతి సాధించిన మనం సైబర్‌ సెక్యురిటీలో ఈ ప్రపంచానికి లీడర్‌ గా ఎందుకు ఎదగలేం

ప్రపంచానికి సైబర్‌ సెక్యురిటీ ఇచ్చే ఏకైక దేశం మనదే ఎందుకు కాకూడదు?

స్టార్టప్స్‌ కు మేధో సంపత్తి హక్కుల ఇబ్బంది రాకుండా ఆలోచన చేస్తున్నాం

మేధో సంపత్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం సహాయం అందిస్తుంది

స్టార్టప్‌ పేటేంట్ల కోసం న్యాయవాదులు తమ ఫీజులో 80 శాతం తగ్గించుకోవాలని కోరుతున్నా

ఏటా రూ.2,500 కోట్లు ఖర్చు చేసేలా రూ.10 వేల కోట్లతో స్టార్టప్‌ ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నాం

స్టార్టప్‌ లకు పన్ను రాయితీ, మూలధన పన్ను రాయితీ పాటు మరెన్నో సౌకర్యాలు కల్పిస్తాం

స్టార్టప్స్‌ లాభాలపై మూడేళ్ల వరకు ఆదాయపన్ను వేయం

కార్మిక, పర్యావరణ చట్టాలను పాటిస్తామని స్వీయధ్రువీకరణ ఇస్తే మూడేళ్ల వరకు తనిఖీలు చేయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *