మెక్సికో సిటీ : మెక్సికోలోని పీమెక్స్ చమురు కర్మాగారం ప్రధాన కార్యాలయంలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. 80 మందికిపైగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న సహాయకసిబ్బంది హెలికాప్టర్లు, అంబులెన్స్‌ల సహాయంతో క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు చేర్చారు. వందలాది మంది ఉద్యోగులు ఉండే 54 అంతస్తుల పీమెక్స్ చమురు కంపెనీ కార్యాలయం కింది అంతస్తులో పేలుడు సంభవించింది. ఘటన అనంతరం భవనం నుంచి ఉద్యోగులు దూకడంతో ఎక్కువ మంది గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరా గదిలో గ్యాస్ లీకేజీ కారణంగా పేలుడు జరిగినట్లు భావిస్తున్నారు. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద చమురు కంపెనీ అయిన పీమెక్స్ రోజుకి 2.5 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును ఉత్పత్తి చేస్తుంది. గత ఏడాది రేనోసలోని కంపెనీకి చెందిన గ్యాస్ ప్లాంట్‌లో జరిగిన పేలుడులో 30 మంది మృతి చెందారు.




