Monday, 2 November 2026

మొబైల్ యాప్ తో మేడారం సమాచారం!

wy4pc770తెలంగాణ కుంభమేళ.. మేడారం జాతరను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు అధికార యంత్రాంగం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఎన్నడూలేని విధంగా మోబైల్ యాప్ టెక్నాలజీని వినియోగిస్తుంది పోలీస్ శాఖ. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝా మొబైల్ యాప్ ను తయారు చేయించారు. వరంగల్ పోలీసులు, నిట్ విద్యార్థులు సంయుక్తంగా రూపొందించిన ఈ అప్లికేషన్‌కు వెల్‌కమ్ టు మేడారం అని పేరు పెట్టారు. ఈ యాప్‌ను వినియోగించుకుని ఎప్పటికప్పుడు జాతరలోని పరిస్థితులను తెలుసుకోవచ్చు.

ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, ఒక వేళ తలెత్తితే వెంటనే పరిష్కరించేలా ఈ యాప్ ను తీర్చిదిద్దారు. జాతర విశేషాలతోపాటు…ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్ డేట్ చేసుకునే విధంగా ఈ యాప్ లో ఎన్నో ఫీచర్స్ పొందుపర్చారు. జాతరకు వచ్చే ప్రతీ ఒక్కరూ ఈ యాప్ సేవలను వినియోగించుకోవచ్చు. రెండేండ్ల క్రితం జరిగిన జాతరలో ట్రాఫిక్ సమస్యలతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి జాతరలో అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసు శాఖ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది.

యాప్ లో రూట్ మ్యాప్, జాతర తేదీలు, వాహనాలు వెళ్లేదారులు, పార్కింగ్ స్థలాలు, జాతరలో ఏర్పాటు చేసిన ఆసుపత్రుల వివరాలు, స్నానఘట్టాలు, మిస్సింగ్ కేసులు, దర్శనీయ స్థలాలు, హెల్ప్ లైన్లు ఇలా జాతరలకు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపర్చారు. నిట్ లో బీటైక్ ఫైనలియర్ చదువుతున్న దేవేందర్, సాయితేజలు ఈ యాప్ కు రూపకల్పన చేశారు. ఇంకేం….స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్ లోకి వెళ్లి మేడారం యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *