ప్రధాని నరేంద్ర మోదీ అరబ్ దేశాల పర్యటనలో భాగంగా యూఏఈలో ఆగస్టు 17న జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రవాస భారతీయులు, దౌత్యవర్గాలు కసరత్తు చేస్తున్నాయి. 34 ఏళ్ల తర్వాత భారత ప్రధాని.. యూఏఈ పర్యటనకు వస్తుండటంతో.. రాజకీయాలకు అతీతంగా ప్రవాసీయులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ ప్రధాని అయ్యాక న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్, సిడ్నీలోని ఆల్ఫోన్స్ ఎరీనాల్లో ఏర్పాటుచేసిన సభలకు దీటుగా దుబాయ్ సభ జరపాలని నిర్వాహకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. దుబాయిలోని ప్రవాసీ భారతీయ వ్యాపారులందరు స్వచ్ఛంధంగా ప్రధాని సభను విజయవంతం చేయడానికి ముందుకు వస్తున్నారు. దుబాయి మార్కెట్లో గుజరాతీ వ్యాపారస్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీరితోపాటు తెలుగు, కేరళ రాష్ట్రాల వారూ ఎక్కువగానే ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల ప్రవాసీయులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు వేసుకున్న లెక్కల ప్రకారం 50 వేలకు పైగా మంది సభకు హాజరవుతారని నిర్వహకుల అంచనా. సభ ఏర్పాట్లను ప్రధాని కార్యాలయం, బీజేపీ వర్గాలు ఎప్పటికప్పుడు సమిక్షిస్తున్నాయి.
మోడీ సభకు భారీ ఏర్పాట్లు




