Tuesday, 3 November 2026

మోదీజీ.. తెలంగాణ అభివృద్ధికి సహకరించండి

C
– ప్రధానితో సీఎం కేసీఆర్‌ భేటీ

– విద్యుదుత్పత్తికి సహకరిస్తాం

– కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌

ఢిల్లీ,ఫిబ్రవరి 12(జనంసాక్షి):ఏపీ పునర్విభజన చట్టంలోని హావిూలన్నింటినీ వెంటనే నెరవేర్చాలని సీఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ¬దా, ఐటీఐఆర్‌ కు నిధులు, ఎఫ్‌.ఆర్‌.బీ.ఎం పరిమితి పెంపు తదితర అంశాలను పరిశీలించాలని సీఎం కేసీఆర్‌ ప్రధానికి వినతి పత్రాలు సమర్పించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ ప్రధాని మోడీతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర సమస్యలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నామని సీఎం కేసీఆర్‌ ప్రధానికి వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కావాలని ఆయన మోడీని కోరారు. అటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కరువు రక్కసిని తరిమికొట్టేందుకు సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన నిర్మిస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. దీనిలో భాగంగా ప్రాణహిత ? చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్‌ చేశామని తెలిపారు. ప్రాణహిత, కాళేశ్వరం నిర్మాణం కోసం భారత ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్‌ సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేస్తున్నదని తెలిపారు. 71 వేల 436 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు, 4 వేల 231 కోట్లతో ప్రాణహిత ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి సాయం చేయాలని ప్రధానిని కోరారు. 2013లో అప్పటి ప్రభుత్వం హైదరాబాద్‌ ను ఐటీఐఆర్‌ కోసం ఎంపిక చేసిందన్న సీఎం కేసీఆర్‌.. దీనికి సంబంధించిన స్థలాలను కూడా గుర్తించి సమగ్ర నివేదిక పంపామన్నారు. కొన్ని కంపెనీలు తమ కార్యకలాపాలను కూడా ప్రారంభించాయన్నారు. ఐటీఐఆర్‌ పథకాన్ని ముందుకు తీసుకుపోవడానికి అవసరమైన నిధులు కేటాయించాలని ప్రధానిని కోరారు. 14వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్ర వార్షిక రుణ పరిమితిని జీఎస్‌డీపీపై 0.5 శాతం వరకు పెంచడానికి సిఫారసు చేసిందన్న సీఎం.. ఆ మేరకు ఎఫ్‌ ఆర్‌ బిఎమ్‌ పరిమితిని పెంచాలని కోరారు. తెలంగాణలో నెలకొల్పబోయే ట్రైబల్‌ యూనివర్సిటీని సెంట్రల్‌ యూనివర్సిటీగా గుర్తించి తగిన నిధులు కేటాయించాలని ప్రధానిని కోరారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు నల్లా ద్వారా అందించడం కోసం 40 వేల కోట్లతో మిషన్‌ భగీరథ కార్యక్రమం చేపట్టామన్న సీఎం కేసీఆర్‌.. ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహాయం కింద ఈ పథకానికి పది వేల కోట్ల ఆర్థిక సహకారం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఎయిమ్స్‌ నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్న సీఎం.. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం 2 వందల ఎకరాలను కేటాయించిందన్నారు. 2016-17 బడ్జెట్‌ లో ఎయిమ్స్‌ నిర్మాణం కోసం కేంద్రం నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్‌ ప్రధానిని కోరారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్‌ ల కొరత ఉందని సీఎం కేసీఆర్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. నగర ప్రాంతం ఎక్కువగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల సేవలను మరింత విస్తరించాల్సి ఉందన్న సీఎం.. ఐపీఎస్‌ ల సంఖ్యను 112 నుంచి 141కి పెంచాలని కోరారు. ఉమ్మడి హైకోర్టును విభజించాలని రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ కోరుతున్నామన్న సీఎం.. వెంటనే ఉమ్మడి హైకోర్టును విభజించి ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. కరువు పరిస్థితులను తట్టుకునేందుకు 3 వేల 64 కోట్లను కేటాయించాల్సిందిగా కోరినా.. కేంద్రం కేవలం 791 కోట్లు మాత్రమే ఇచ్చిందన్న సీఎం? మిగతా మొత్తం కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామన్న సీఎం.. వీటికి కోట్లాది రూపాయల వ్యయం అవుతుందన్నారు. నీతి అయోగ్‌ కూడా తెలంగాణకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని సిఫారసు చేసిందని గుర్తుచేశారు. వచ్చే నాలుగేళ్ల కోసం 30 వేల 571 కోట్లు ప్రత్యేక గ్రాంటు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ప్రధానిని కోరారు. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటర్‌ రీసెర్చ్‌ హైదరాబాద్‌ లో తమ శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్న సీఎం.. 2007లోనే హైదరాబాద్‌ యూనివర్సిటీ పక్కన స్థలాన్ని గుర్తించిందన్నారు. 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ టీఐఎఫ్‌ఆర్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌ కు శంకుస్థాపన కూడా చేశారన్నారు. టీఐఎఫ్‌ఆర్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌ కోసం రూ. 2,500 కోట్లు వ్యయం చేస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్టు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదిగా భావిస్తున్నామన్న సీఎం.. కేంద్ర ప్రభుత్వం వెంటనే అనుమతులు మంజూరు చేసి అవసరమైన నిధులు ఇవ్వాలని ప్రధానిని కోరారు. నాణ్యమైన పత్తి ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని సీఎం కేసీఆర్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కాటన్‌ బౌల్‌ గా పేరుగాంచిన వరంగల్‌ లో మెగా టెక్స్టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌ టైల్స్‌ పార్క్స్‌ పథకం కింద 50 శాతం నిధులు కేటాయించాలని ప్రధానిని కోరారు. ఈ పార్క్‌ ఏర్పాటుతో స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.విశ్వనగరాలుగా అవతరిస్తున్న హైదరాబాద్‌, ముంబై లాంటి నగరాల్లో మౌలిక వసతుల కల్పన పై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్‌ ప్రధానిని కోరారు. హైదరాబాద్‌ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు పక్కా విజన్‌ తో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి.. సిటీ అభివృద్ధికి 30 వేల 370 కోట్లు అవసరమని అహ్లువాలియా కమిటీ 2011లోనే సూచించిందన్నారు. హైదరాబాద్‌ లో రక్షిత తాగునీరు అందించడంతోపాటు మెరుగైన డ్రైనేజ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు 15 వేల కోట్లు అవసరమన్నారు. ట్రాఫిక్‌ నరకం నుంచి నగరవాసులకు విముక్తి కల్పించేందుకు సిగ్నల్‌ ఫ్రీ కారిడార్స్‌, అత్యాధునిక రోడ్ల కోసం 20 వేల 661 కోట్లు అవసరమన్నారు. అంతర్జాతీయ నగరాలుగా అవతరిస్తున్న హైదరాబాద్‌ లో మంచినీటి సరఫరా, డ్రైనేజ్‌ , రవాణా, తదితర రంగాల్లో మెరుగైన సేవలు అందించాలన్నారు. హైదరాబాద్‌ తో పాటు మిగతా 5 మహానగరాలకు ఏడాదికి కనీసం 5 వందల నుంచి 6 వందల కోట్ల నిధులు కేంద్రం ఇవ్వాలన్నారు.

తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తికి సహకరిస్తాం: పీయూష్‌ గోయల్‌

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ ముగిసింది. విద్యుత్‌ రంగానికి సంబంధించిన పలు అంశాలను పీయూష్‌ గోయల్‌కు సీఎం వివరించారు. తాము ఇచ్చిన ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని సీఎం తెలిపారు. రామగుండం ఎన్టీపీసీ ద్వారా 2020 నాటికి 4 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామని పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. ఆ సమయానికి ఎన్టీపీసీ ద్వారా విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఖమ్మం మణుగూరులో రెండేళ్లలో 1080 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. సోలార్‌ పార్కులు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ కోరారని పేర్కొన్నారు. తెలంగాణలో 3, 4 ఏళ్లలో 5,800 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *