Tuesday, 3 November 2026

మోదీ మౌనం దేశానికి ప్రమాదకరం

C

– దేశంలో అసహనం పెరిగింది

– కాంగ్రెస్‌ మార్చ్‌

– రాష్ట్రపతి ప్రణబ్‌కు సోనియా ఫిర్యాదు

న్యూఢిల్లీ నవంబర్‌ 3(జనంసాక్షి):

దేశంలో మత అసహన పరిస్థితులు దారుణంగా పెరిగిపోయాయని, మోదీ మౌనం దేశానికే ప్రమాదకరమని  కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను వ్యతిరేకిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం ఫిర్యాదు చేసింది. సోనియా నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రపతి భవన్‌ కు ప్రదర్శనగా వెళ్లారు. 11 మంది ప్రతినిధులు రాష్ట్రపతిని కలిశారు.

దేశంలో సహన శీలత తగ్గటాన్ని కాంగ్రెస్‌ పార్టీ అంగీకరించదని సోనియా తెలిపారు. ఇలాంటి అంశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. దేశంలో అసహనం పెరిగిపోతున్నప్పటికీ ప్రధాని మోడీ చేతులు ముడుచుకొని కూర్చోవటమేమిటని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రపతితో సోనియా 40 నిముషాల సేపు ముఖా ముఖిగా సమావేశం జరిపారు. దేశంలో పెరుగుతున్న అసహన పరిస్థితులను ఆయనకు వివరించినట్టు సమాచారం. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలని సోనియా రాష్ట్రపతిని కోరినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై సోనియా నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ బృందం మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో సమావేశం కానుంది. బీఫ్‌ వివాదం, దాద్రీ ఘటన, అభ్యుదయ వాదుల హత్యలపై చర్చించనున్నారు.

దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతోంది ఆర్‌.ఎస్‌.ఎస్‌ సంస్థేనని రాహుల్‌ గాంధీ విమర్శించారు. అసహన పరిస్థితులు పెరిగిపోతున్నప్పటికీ కేంద్రం పట్టించుకోకపోవటంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని రాహుల్‌ చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్‌, ఆర్‌.బి.ఐ గవర్నర్‌ రాజన్‌ లే ఈ అంశాన్ని ప్రస్తావించారని రాహుల్‌ గుర్తు చేశారు. రచయితలంతా ఇన్‌టాలరెన్స్‌ కు వ్యతిరేకంగా అవార్డులు వాపసు ఇస్తుంటే కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ మాత్రం ప్రశాంత పరిస్థితులు ఉన్నాయని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పోరాటం కాంగ్రెస్‌ పార్టీ ఒక్కరిదే కాదని దేశ ప్రజలందరిదని రాహుల్‌ చెప్పారు.ఇది ఇలా ఉండగా దేశంలో నెలకొన్న అసహన పరిస్థితులపై విపక్షాలు, మేధావులు తమ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోది తిప్పికొట్టారు. ఇందిరా గాంధీ హత్య అనంతరం1984లో దేశంలో జరిగిన సిక్కుల ఊచకోతపై ఊసెత్తని కాంగ్రెస్‌కు అసహన పరిస్థితులపై మాట్లాడే హక్కు లేదన్నారు. దేశంలో నెలకొన్న అసహన పరిస్థితులకు కాంగ్రెస్సే కారణమని ప్రధాని ఆరోపించారు.

బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ఖాన్‌ ఆందోళన ……

దేశంలో పెరుగుతున్న అసహన పరిస్థితులపై బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ఖాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రచయితలు, కళాకారులు ఏ రంగానికి చెందిన వారైనా సరే వారికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండాలని షారుఖ్‌ పేర్కొన్నారు. అవార్డులు వెనక్కి ఇచ్చేస్తున్న మేధావులు, రచయితలు, కళాకారులను గౌరవిస్తున్నానని తెలిపారు. ఒక కళాకారుడిగా నైతికత అంశంపై తన భావాలను వెల్లడించడం ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. ఏదైనా మాట్లాడితే తన ఇంటిపై రాళ్లు విసిరినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.

బీఫ్‌ వివాదం, దాద్రీ ఘటన….

బీఫ్‌ వివాదం, దాద్రీ ఘటన, అభ్యుదయ వాదులు కల్బుర్గి, పన్సారే, దబోల్కర్‌ హత్యలకు నిరసనగా దేశంలో అసహన పరిస్థితి నెలకొంది. గత కొన్ని వారాలుగా రచయితలు, కళాకారులు, సైంటిస్టులు తమ అవార్డులను వెనక్కి పంపడం ద్వారా నిరసన తెలుపుతున్నారు. భావ వ్యక్తీకరణపై జరుగుతున్న దాడికి మోది సర్కార్‌దే బాధ్యత అంటూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పరమత సహనం అనాదిగా వస్తున్న భారతీయ సాంప్రదాయమని, దీన్ని భావి తరాలు కాపాడాలని భారత్‌లో నెలకొన్న అసహన పరిస్థితులపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇటీవల ఘాటుగా స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *