యనమల ట్రస్ట్ ద్వారా 2లక్షల విరాళం
బుట్టారేణుక విరాళం 5లక్షలు
అమరావతి,ఆగస్ట్21(జనం సాక్షి): ఎపి ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం కేరళ వరద బాధితుల సహాయార్థం యనమల ఫౌండేషన్ తరపున రూ.2 లక్షల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేరళ వరద బాధితులను ఆదుకొనే విషయంలో కేంద్రం ముందుకు రావాలని కోరారు. జలవిలయంతో అల్లాడుతున్న కేరళ వరద బీభత్సాన్ని కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇదిలావుంటే కేరళ వరద బాధితుల సహాయార్థం పార్లమెంట్ సభ్యుల నిధి నుంచి కర్నూలు ఎంపీ బుట్టారేణుక రూ. 5 లక్షలను విరాళంగా ప్రకటించారు. వర్షాల కారణంగా కేరళలో నదులన్నీ పొంగి పొర్లుతున్నాయని, వరద ప్రభావంతో భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించిందన్నారు. ప్రధానంగా ఎర్నాకులం జిల్లాలో పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. అక్కడి ప్రజలకు, ప్రభుత్వానికి అండగా నిలవాలన్న ఉద్దేశంతో తన ఎంపీ కోటా నుంచి రూ. 5 లక్షల విరాళం పంపినట్లు ఆమె తెలిపారు.