తెలంగాణ గ్రామీణ వ్యవస్థకు చెరువులే జీవనాధారమని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వరంగల్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో ప్రజలకు, చెరువులకు విడదీయరాని సంబంధం ఉన్నదన్నారు. చెరువులు తెలంగాణ వారసత్వ సంపద అని చెప్పారు. చెరువులకు నీళ్లు వస్తే వచ్చే ఖరీఫ్, రబీ పంటలకు నీళ్లు అందుతాయని తెలిపారు. చెరువుల్లో పూడిక తీసిన మట్టిని రైతులు పొలాల్లో వేసుకోవాలని సూచించారు. చెరువులను ధ్వంసం చేయొద్దని ఆనాటి రాజులు శత్రురాజులను కోరారని గుర్తు చేశారు. ఆంధ్రా పాలకులు మాత్రం ఉద్దేశపూర్వకంగా చెరువులను నాశనం చేశారని పేర్కొన్నారు. చెరువుల పునరుద్ధరణతో 3 నెలల్లో ఫలితాలు అందుతాయని తెలిపారు. మిషన్ కాకతీయను ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఏడాదికి 9వేల చెరువులను పునరుద్ధరిస్తున్నామని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని నియోజకవర్గాల్లో చెరువుల పునరుద్ధరణ జరుగుతుందన్నారు. గతంలో లాగా నామమాత్రపు పనులు జరగవు అని స్పష్టం చేశారు.
రాజకీయాలకు అతీతంగా చెరువుల పునరుద్ధరణ




