Tuesday, 3 November 2026

రాజపక్సేకు తమిళుల నిరసన

6

శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక అధ్యక్షుడు

తిరుపతి,డిసెంబర్‌10,(జనంసాక్షి)

రెండు రోజుల పర్యటనలో నిమిత్తం తిరుమలకు విచ్చేసిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు తమిళుల నుంచి అడుగడుగునా నిరసనలు ఎదురయ్యాయి. ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్న రాజపక్సే మంగళవారం తిరుమలకు చేరుకునే సమయంలో తమిళనాడు నుంచి తిరుపతికి చేరుకున్న రాజకీయ పక్షాలు రాజపక్సేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. రాజపక్సే వెళ్లిపోవాలంటూ రోడ్లపై నినాదాలు చేశారు. ఈ క్రమంలో వందలాది మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం వేకువ జామున స్వామివారిని దర్శించుకుని ఆలయం నుంచి వెలుపలకు వచ్చే సమయంలో లేపాక్షి వలయం వద్ద వైగో మద్దతు దారులు జెండాలతో ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో స్వల్ప లాఠీ చార్జి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను పోలీసు వాహనంలో ఎక్కించి పాపవినాశనం లోని అటవీప్రాంతంలో వదిలి పెట్టారు. దాదాపు 100మందికి పైగా వైగో మద్దతు దారులను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు నుంచి వచ్చిన విూడియా ప్రతినిధులను కూడా పోలీసులు అడ్డుకున్నారు.తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అంతకు ముందు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ మార్గం ద్వారా ఆలయం వద్దకు చేరుకున్న రాజపక్సేకు మహాద్వారం వద్ద జేఈఓ శ్రీనివాసరాజు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపం వద్దకు చేరుకున్న రాజపక్సేకు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేసి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం జేఈవో ఇతర ఆలయ అధికారులు కలిసి స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని రాజపక్సేకు అందజేశారు. ఆలయం వెలుపల రాజపక్సే మాట్లాడుతూ… అన్ని కులాలు, మతాల వారు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. అన్ని ప్రాంతాల వారు తనకు సోదరులు లాంటివారని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *