Tuesday, 3 November 2026

రాజ్యసభలో ‘హెరాల్డ్‌’ వార్‌

C

– కాంగ్రెస్‌, లెఫ్ట్‌ సభ్యుల సస్పెన్షన్‌

న్యూఢిల్లీ,డిసెంబర్‌11(జనంసాక్షి):  వరుసగా శుక్రవారం కూడా నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారాన్ని నడపాలని చూసిన కాంగ్రెస్‌ భంగపడింది. రాజ్యసభలో కాంగ్రెస్‌,వామపక్షాల కు చెందిన ఇరవై మూడు ఎమ్‌.పిలను సస్పెండ్‌ చేశారు.ఈ మద్య కాలంలో ఇంతమంది పార్లమెంటులో సస్పెండ్‌ కావడం ఇదే తొలిసారి. నేషనల్‌  హెరాల్డ్‌ పత్రిక ఆస్తుల కేసులో కాంగ్రెస్‌ ఎంపిలు గత కొద్ది రోజులుగా ఆందోళన సాగిస్తున్నారు. రెండుసభలలోను వీరు కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారు.ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో రాజ్యసభ ఉపాద్యక్షుడు కురియన్‌ కాంగ్రెస్‌ ఎంపిలతో పాటు, ఆందోళన చేస్తున్న వామపక్షాల సభ్యులను కూడా సస్పెండ్‌ చేశారు. సమావేశాలు ముగిసే రోజు వరకు వీరిని సస్పెండ్‌ చేశారు. లోక్‌ సభలో కూడా కాంగ్రెస్‌ ఎంపిలు ఆందోళన చేస్తున్నారు. సస్పెన్షన్‌ ప్రకటన తర్వాత కాంగ్రెస్‌ ఎంపిలు వెల్‌ లోకి దూసుకు వచ్చి నినాదాలు చేస్తుండడంతో రాజ్యసభను అరగంట సేపు వాయిదా వేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యులు శుక్రవారం కూడా  ఆందోళన కొనసాగించారు. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కాంగ్రెస్‌ సభ్యుల ఆందోళన మధ్యే డిప్యూటీ చైర్మన్‌ ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. దీంతో చివరకు వారిని సస్పెండ్‌ చేశారు. ఇదిలావుంటే కాంగ్రెస్‌ తీరును పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు తప్పుపట్టారు. కావాలనే కోర్టు వ్వయహారాలను ఇక్కడ లాగుతున్నారని మండపడ్డారు. ఇక  ప్రతిపక్షం నుంచి ప్రధానమంత్రి ఏం కోరుకుంటున్నారో చెప్పాలని సోనియాగాంధీ అన్నారు. పార్లమెంట్‌కి పాలిటిక్స్‌కు లింక్‌ పెట్టొద్దు. జీఎస్‌టీ బిల్లుకోసం కోట్లాదిమంది ఎదురు చూస్తున్నరన్న వెంకయ్యనాయుడు వ్యాఖ్యలపై సోనియా స్పందిస్తూ.. ప్రతిపక్షం నుంచి ప్రధాని ఏం కోరుకుంటున్నారో చెప్పాలన్నారు.  కావాలనే సభను ప్రతిపక్షం అడ్డుకోవడం లేదు. ఎవరిపల్ల ప్రజాస్వామ్యానికి భంగం వాటిల్లుతుందో తెలుసుకోవాలని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *