రాలిన మరో విద్యార్థి కుసుమం
సీనియర్ల వేధింపులే కారణమని ఆరోపణ
అనంతపురం,ఆగస్ట్14(జనం సాక్షి): కారణాలు ఏవైనా విద్యార్థుల్లో బతుకుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. దీంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నతల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వరుసగా ఇద్దరు మెడికోలు ఆత్మహత్య చేసుకోగా తాజాగా బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది. ప్రియాంక అనే యువతి మదనపల్లిలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతుంది. అయితే, గత కొంతకాలంగా ఆమెను సీనియర్లు వేధింపులకు గురిచేస్తున్నారు. వాళ్ల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ల వేధింపుల గురించి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుందని సమాచారం. సోమవారం కళాశాల నుంచి ఇంటికి వస్తున్న సమయంలో కొందరు ఆమెను బస్సులో బెదిరించారని సమచారాం. ఈ క్రమంలో మంగళవారం ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీంతో కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రియాంక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.