Tuesday, 3 November 2026

రెండేళ్లలో ముల్కనూరు మారిపోవాలి

2w2utq8c రెండేళ్లలో ముల్కనూరు పూర్తిగా మారిపోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఆయన దత్తత తీసుకున్న కరీంనగర్ జిల్లాలోని చిన ముల్కనూరులో జరిగిన గ్రామజ్యోతి సభలో పాల్గొన్నారు. ముల్కనూరులో తాను ఉన్నా ఇంకా ఏడ్చుడు బంద్‌ చేయాలన్నారు. సమస్య, దరిద్రం, పేదరికం మీద మనమంతా యుద్ధం చేయాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

ముందుగా ఇండ్లను బాగు చేసుకుందామన్న ముఖ్యమంత్రి, గ్రామంలో అందరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ఇస్తామన్నారు. తాను వెళ్లినా అధికారులంతా ఇక్కడే ఉండి పనులు చేస్తారని చెప్పారు. మంత్రి ఈటెల రాజేందర్‌ మూడు రోజులకోసారి వచ్చి పనులను పరిశీలిస్తారని తెలిపారు. ఇండ్లకోసం జాగ లేని వారికి ప్రభుత్వం ఒకటి, రెండు ఎకరాల భూమి కొని కట్టిస్తుందన్నారు. ఎవరైనా భూ దాతలు ఉంటే ముందుకు రావాలని ఆయన కోరారు.

10, 12 రోజుల్లో తానే వచ్చి ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఐదు నెలల్లోపు ఇండ్ల నిర్మాణం పూర్తిచేసి, ఇండ్లల్లోకి పోవాలని ఆయన స్పష్టం చేశారు. ఇంటింటికి మంచినీటి నల్లా సౌకర్యం కల్పిస్తామన్నారు. ముల్కనూరులో ఆడబిడ్డ ఎవరూ నీళ్లకోసం బయటికి వెళ్లొద్దని చెప్పారు. కొత్తగా కట్టే ఇండ్ల దగ్గర కరెంట్‌ తీగలకు ఇబ్బంది లేకుండా చెట్లు పెంచుకుందామన్నారు. పెద్దపెద్ద డాక్టర్లను తీసుకొచ్చి మన ఆరోగ్యాన్ని బాగు చేసుకుందామని అన్నారు.

భూమిలేని వాళ్లకోసం మనమే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఊరిలో ఉన్న టైలర్లు, ఎరువులు షాపులు లాంటి వాళ్లని ప్రోత్సహిస్తే ఆ కుటుంబాలు బాగుపడ్తాయన్నారు. ఆసరా లేనోళ్లకు ఊరోళ్లే అండగా ఉండాలని చెప్పారు. మంచి కూరగాయలు, లాభసాటి పంటలు పండించేలా గ్రామస్తులకు శిక్షణ ఇప్పిస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. మీ ఊరికి గోదావరి నీళ్లు తెప్పిస్త, నీటి కొరత లేకుండా చేస్తానన్నారు. ఇంటికి రెండుమూడు బర్రెలు ఇస్త, పాడిపరిశ్రమని కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పారు.

ఊరిలో మంచి కమ్యూనిటీ హాల్‌ ను కట్టిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దళితులకు కూడా ఓ కమ్యూనిటీ హాల్‌ కట్టిస్తానన్నారు. ఇప్పుడున్న అంబేద్కర్‌ భవనాన్ని మహిళా సంఘానికి అప్పగిద్దామని చెప్పారు.

గ్రామంలో ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమైనప్పటి నుంచి తాను చూస్తూనే ఉంటానని, ఇండ్ల నిర్మాణం చాలా వేగంగా జరుగుతదని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈలోగా గ్రామస్తులంతా అంకాపూర్, హైదరాబాద్‌ లోని ప్రగతి రిసార్టులను చూసి రావాలని సూచించారు. అక్కడ ఎట్ల అభివృద్ధి చేసిన్రో మీరు కూడా అట్లనే చేసుకోవాలని, ముల్కనూరును దోమలేని గ్రామంగా తీర్చిదిద్దుకుందామన్నారు.

గ్రామంలో తిట్లు బంద్‌ పెట్టాలని, ఇప్పటి నుంచి నెల రోజులు సమయం ఇచ్చి తిట్లు తిడితే రూ. 50 ఫైన్‌ వేద్దామన్నారు. అట్లా చేస్తే వంద శాతం బాగుపడ్తామన్నారు. అందరం కలిసి అందరినీ బతికించే ఉపాయం చేద్దామని పిలుపునిచ్చారు. మంచి పునాది గ్రామంగా ముల్కనూరు తయారైతదన్నారు. రాబోయే నాలుగేళ్లలో ముల్కనూరుకు రూ. కోటి 80 లక్షల నిధులు మంజూరు చేస్తామని, వాటిని మంచి పనులకు ఉపయోగించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. జిద్దుమీద నాలుగైదు నెలలు పని చేస్తే ఊరు స్వర్గసీమ అయితదని వారిలో ఉత్సాహం నింపారు. ఇతర దేశాల నుంచి వచ్చి చిన్నముల్కనూరు గురించి తెలుసుకునేలా అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

చిన ముల్కనూరు గ్రామజ్యోతి వేదిక నుంచే రాష్ర్టంలోని పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులందరికి సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. గ్రామజ్యోతిలో పంచాయతీరాజ్‌ లోని ప్రజాప్రతినిధులందరూ సమాన బాధ్యులేనన్నారు. మీమీ గ్రామాల్లో గ్రామసభల్లో పాల్గొని ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఎవరూ బేధాభిప్రాయాలకు పోవద్దు, రాజకీయాలకు అతీతంగా కలిసి పని చేయాలని చెప్పారు. ఇది ప్రారంభం మాత్రమేనని, వెలిగించిన గ్రామజ్యోతిని ఆరిపోకుండా కొనసాగించాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఐక్యంగా ఉండి మన గ్రామాలను స్వర్గసీమగా మార్చుకోవాలన్నారు. మనమంతా అద్భుతంగా పని చేస్తే బంగారు తెలంగాణ సాధ్యమైతదని స్పష్టం చేశారు.

గ్రామాభివృద్ధిలో పాలుపంచుకునేందుకు వచ్చిన 150 మంది మాజీ సైనికులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. ఉడుతా భక్తితో ఎంతోకొంత సాయం చేద్దామని రూ. లక్ష విరాళం ఇచ్చిన గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులను ఆయన అభినందించారు. వీరితో పాటు రాజారెడ్డి రూ. 50 వేలు, రాజేషం గౌడ్‌ రూ. లక్ష, దత్తయ్య పంతులు 4 గుంటల భూమి, రామచంద్రం 2 గుంటల భూమి విరాళంగా ఇచ్చారు. దాతలను సీఎం కేసీఆర్ సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *