ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. పంట చేతికొచ్చే సమయానికి వర్షం రూపంలో అన్నదాతల మీద పిడుగు పడింది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో పరిస్థితి దయనీయంగా ఉంది. ఎక్కడ చూసినా నీటిపాలైన పత్తి, మొక్కజొన్నే కనిపిస్తోంది.నర్సంపేట డివిజన్ లో కోటి ఆశలతో తెల్లబంగారం పండించిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. ఖరీఫ్ ఆరంభంలో వరుణుడు కరుణించకపోయినా… ఎలాగోలా పంటను బతికించుకున్నారు అన్నదాతలు. విత్తనాలు, ఎరువులు, ఇతర ఖర్చులు కలిపి ఎకరానికి 50, 60 వేల రూపాయల దాకా ఖర్చయ్యాయి. ఇక తమ కష్టాలన్నీ తీరిపోయినట్టేనని భావించారు. కానీ పంట చేతికొచ్చే సమయానికి వరుణుడు కోలుకోలేని దెబ్బతీశాడు. వర్షాలకు పత్తికాయ మొత్తం తడిసిపోయింది. కాయలు ఏరకముందే నల్లగా మారి మురిగిపోయాయి. కనీసం పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేక ఏం చేయాలో పాలుపోక అన్నదాతలు కుమిలిపోతున్నారు. అటు అధికారులెవ్వరూ పంటనష్టాన్ని చూడడానికి కూడా రాలేదు. ప్రభుత్వం పంటనష్టంపై సర్వే చేయించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.అటు మొక్కజొన్న పంట పరిస్థితి కూడా దారుణంగా ఉంది. వర్షబీభత్సంతో చేతికొచ్చిన జొన్న కంకులన్నీ తడిసిపోయాయి. ఎలాగోలా మార్కెట్ కు పంటను తీసుకొస్తే అక్కడా అకాలవర్షం ముంచేసింది. మొక్కజొన్నంతా నీటిపాలై పోయింది. అటు మార్కెట్ లో వ్యాపారులు కూడా రైతులను కరుణించలేదు. తేమశాతం పేరుతో పంటను కొనలేమని కుంటిసాకులు చెబుతున్నారు. సర్కారే తమను కాపాడాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.భారీవర్షం ఇంత దెబ్బతీస్తుందని ఊహించలేకపోయామంటున్నారు రైతన్నలు. తినే సమయానికి వానొచ్చి నోట్లో మట్టి కొట్టిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే పంటనష్టాన్ని అంచనా వేసి…పరిహారాన్ని చెల్లించాలని వేడుకుంటున్నారు.
రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు.




