రైల్వేస్టేషన్‌లో మహిళపై దాడి

– పిల్లలను ఎత్తుకెళ్లే మహిళ అనుకొని దాడిచేసిన యువకులు 
గుంటూరు, మే24(జ‌నం సాక్షి) : రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలుతున్న వదంతులతో అమాయకులపై దాడులు జరుగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులపై స్థానిక ప్రజలు భయాందోళనతో ముందస్తు దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే వాట్సప్‌లో వచ్చిన మెస్సేజ్‌లతో తెలుగు రాష్ట్రాల్లో పలువురిపై ఆయా ప్రాంతాల ప్రజలు అనుమానంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇప్పటికే నలుగురు మృతి చెందారు. కాగా మరో ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా రెపల్లె రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని మహిళపై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్లలను అపహరించే ముఠాగా భావించిన యువకులు మహిళపై దాడి చేశారు. బాధిత మహిళకు మతిస్థిమితం లేకపోవడంతో వారికి సమాధానమివ్వలేకపోయింది. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు బాధితురాలిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో గుంటూరు సర్వజనాస్పత్రికి తరలించారు. సోషల్‌ విూడియాలో వస్తున్న వందతులపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే దాడులకు దిగుతుతున్నారు. వదంతులను నమ్మొద్దని పోలీసులు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు.