Tuesday, 3 November 2026

రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ తనయుడు జానకీరామ్‌ దుర్మరణం

3

తెలంగాణ సిఎం కెసిఆర్‌ సంతాపం

నల్గొండ, డిసెంబర్‌6 (జనంసాక్షి) : టిడిపి సీనియర్‌ నాయకుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి జానకీరాం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద శనివారం సాయంత్రం 6.20 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. జానకీరాం… తన సఫారీ కారు (ఏపీ29 బీడీ 2323)లో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బయలుదేరారు. 65వ నెంబరు జాతీయ రహదారిపై స్వయంగా వాహనాన్ని నడుపుతూ వేగంగా వెళ్తున్నారు. కోదాడ దాటిన తర్వాత ఆకుపాముల వద్దకు చేరుకోగానే… వరి నారు లోడుతో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొన్నారు. ట్రాక్టర్‌ తప్పుడు దారిలో(రాంగ్‌ రూట్‌)లో వస్తుండటం, జానకీరామ్‌ కారు వేగంగా ఉండటంతో ప్రమాదం జరిగింది. సఫారీ వాహనం నేరుగా ట్రాక్టర్‌ ట్రాలీ కిందకు వెళ్లటంతో నుజ్జునుజ్జు అయ్యింది. తీవ్రంగా గాయాలపాలైన జానకీరామ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కోదాడ పట్టణంలోని తిరుమల ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ మృతిచెందారు. తలకు, వెన్నెముకకు తీవ్రంగా దెబ్బలు తగిలి బాగా రక్తం కారడంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా జానకీరామ్‌ను కాపాడలేకపోయారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.

పోస్టుమార్టం చేయకుండానే తరలింపు

జానకీరామ్‌ మృతదేహానికి పోస్టుమార్టం ఎక్కడ నిర్వహించాలనే విషయంపై గంటపాటు తర్జనభర్జన జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్‌ నల్గొండ జిల్లా కలెక్టర్‌ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్‌రావులతో ఫోన్‌లో మాట్లాడారు. రాత్రివేళ కావటంతో మృతదేహాన్ని హైదరాబాద్‌కు పంపించాలని కోరారు. దీంతో కలెక్టర్‌, ఎస్పీలు కూడా అంగీకరించారు. రాత్రి 8 గంటలకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటుచేసి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

జనసంద్రమైన కోదాడ

జానకీరామ్‌ మరణవార్త తెలియగానే కోదాడ పట్టణ, పరిసర గ్రామాల ప్రజలు తండోపతండాలుగా ఆస్పత్రికి తరలివచ్చారు. జానకీరామ్‌… హరికృష్ణ తనయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మేనల్లుడు కావటం, సినీ, రాజకీయం నేపథ్యమున్న కుటుంబం కావటంతో ప్రాధాన్యం నెలకొంది. మృతదేహాన్ని చూడటానికి జనం తరలివచ్చారు. దీంతో పోలీసులు ఆస్పత్రి ద్వారాన్ని మూసివేశారు.

ఎన్టీఆర్‌ బ్యానర్‌పై సోదరుడు కల్యాణ్‌రామ్‌ నటించిన ‘అతనొక్కడే’ సినిమాకు జానకీరామ్‌ నిర్మాతగా వ్యవహరించారు. జానకీరామ్‌కు భార్య, ఇద్దరు కుమారులు వున్నారు. ఆయన కుమారుడు మాస్టర్‌ తారక రామారావు ‘దాన వీర శూర కర్ణ’ అనే బాలల చిత్రంలో నటించనున్నారు.

జానకీరామ్‌ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

సినీనటుడు హరికృష్ణ తనయుడు జానకీరామ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జానకీరామ్‌ కుటుంబసభ్యులకు తమ సంతాపం ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌, ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు, పరిటాల సునీత, తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్య, మంత్రులు నాయిని, జగదీశ్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జానారెడ్డి, సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తదితరులు నందమూరి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *