Monday, 2 November 2026

వడ్డీరేట్లు యథాతథం

7

ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌

ముంబయి డిసెంబర్‌ 2 (జనంసాక్షి) : రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్లు యథాతథంగా ఉంటాయని గవర్నర్‌ రఘురాంరాజన్‌ ప్రకటించారు. ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్‌బీఐ ప్రకటించింది. అన్ని రకాల వడ్డీరేట్లు, నగదు నిల్వల నిష్పత్తిని ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది. 2014-15 సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 5.5 శాతంగా అంచనా వేసింది. ఆర్థిక పునర్‌నిర్మాణంలో సంపూర్ణ ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ వెల్లడించారు. క్రూడాయిల్‌ ధరలు తగ్గటంతో ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.     రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష్షలో ఆర్‌బీఐ కీలక విధాన రేట్లను తగ్గించకపోవచ్చని నిపుణులు, విశ్లేషకులు, మార్కెట్‌ వర్గాలు అంచనా వేశారు. ఆర్‌బీఐ చర్యలు ఎలా ఉన్నప్పటికీ.. బ్యాంకులు మాత్రం రుణాలపై వడ్డీరేట్లను తగ్గించవచ్చనే స్వరాలు తాజాగా వినిపించాయి. బ్యాంకుల వద్ద దండిగా నిధులు ఉండటంతో.. తామే స్వచ్ఛందంగా కొంతలో కొంత వడ్డీ రేట్లను తగ్గిస్తే.. మళ్లీ రుణాలకు గిరాకీ పెరుగుతుందనేది బ్యాంకుల ఉద్దేశంగా కనిపిస్తోంది. కార్పొరేట్ల నుంచి రుణ గిరాకీ పెరుగుతుందన్న సంకేతాలు వస్తే.. వడ్డీ రేట్ల కోత దిశగా అడుగులు పడినట్లే. డిపాజిట్‌ రేట్లు, రుణాల రేట్ల మధ్య వ్యత్యాసం తగ్గుతూ.. బ్యాంకుల మార్జిన్లపై ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఎస్‌బీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వంటి పలు బ్యాంకులు ఇప్పటికే కాలావధి డిపాజిట్‌ రేట్లను తగ్గించాయి. ప్రస్తుతం బ్యాంకుల వద్ద నిధుల లభ్యతకు లోటులేదు. మరోపక్క రుణాలకు గిరాకీ తక్కువ స్థాయిలో ఉంటోంది. దీంతో తమ వద్ద ఉన్న నిధులను బయటకు తీయాల్సిన అవసరం బ్యాంకులకు పెద్దగా ఏర్పడటంలేదు. ప్రస్తుతం ఆర్‌బీఐ యధాస్థితి కొనసాగించవచ్చని అనుకుంటున్నప్పటికీ.. బ్యాంకింగ్‌ వర్గాలు మాత్రం కీలక రేట్లలో కోత ఉంటుందని భావిస్తున్నాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం బాగా దిగిరావడంతో పాటు ముడి చమురు ధరలు రికార్డు కనిష్ఠ స్థాయిలకు చేరిన నేపథ్యంలో కీలక రేట్లలో కోత విధించడానికి ప్రస్తుతం ఆస్కారముంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు మూలధన వ్యయాలు తగ్గించాల్సిన అవసరం ఉందని స్వయానా ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించడంతో రేట్ల కోతకు మరింత బలం చేకూరింది. సరిగ్గా ఏడాది క్రితం నవంబరులో 11.16 శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం.. ఈ ఏడాది అక్టోబరు కల్లా 5.52 శాతానికి దిగివచ్చింది. ఇక ఒపెక్‌ ఉత్పత్తిని ప్రస్తుత స్థాయిల్లోనే ఉంచాలని నిర్ణయించడంతో ముడి చమురు ధరలు 70 డాలర్ల(బారెల్‌కు) దిగువకు చేరాయి. ఇవన్నీ సానుకూల సంకేతాలే. రెపో రేటును ఆర్‌బీఐ 8% వద్దే ఉంచుతుందని కొంతమంది అభిప్రాయపడుతుండగా.. ఏడాది పాటు యథాతథ స్థితిని కొనసాగించిన ఆర్‌బీఐ ఇక ఆ ధోరణికి ముగింపు పలుకుతుందని మరికొందరు అనుకున్నారు. మరికొంత మంది బ్యాంకర్లేమో.. కాలావధి డిపాజిట్ల రేట్ల కోత వల్ల పూర్తి స్థాయి ప్రయోజనాలు అందిన తర్వాతే బ్యాంకులకు రుణ రేట్లను తగ్గించడానికి వీలుంటుందని అంచాన వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *