వరకట్న వేధింపులకు వివాహిత బలి

విజయవాడ,నవంబర్‌30(ఆర్‌ఎన్‌ఎ):వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైంది. కృష్ణా జిల్లా గుడివాడ మండలం చౌటుపల్లికి చెందిన శ్రీలక్ష్మిని రామలింగేశ్వరనగర్‌కు చెందిన రాజేశ్‌కు ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.2.5 లక్షల నగదు, 1.2సెంట్ల భూమి కట్నంగా ఇచ్చారు. అయితే వివాహమైనప్పటి నుంచి దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయని బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలో శ్రీలక్ష్మి అత్తారింట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అదనపు కట్నం కోసం అత్తింటి వారు శ్రీలక్ష్మిని తరుచూ వేధించేవారని, వారే హత్య చేసి ఇప్పుడు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెను పొట్టన పెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు పటమట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసుకుని సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తాజావార్తలు