-మద్యం అమ్మకాల్లో రికార్డు
– 12 రోజుల్లో 585 కోట్లు
– తెలంగాణలో ప్రమాదఘంటికలు
హైదరాబాద్,అక్టోబర్ 13(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. అమ్మకాలకు అంతే లేకుండా పోతోంది. దసరా సెలవులు, పండగ సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలే ఇందుకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా విడుదల చేసిన గణాంకాలు మద్యం ఏరులై పారుతోన్న విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. అక్టోబర్ 1 నుంచి 12వ తేదీ వరకు కేవలం పన్నెండు రోజుల్లోనే రూ. 585.563 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదో రికార్డుగా అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ 7, 8, 9 తేదీల్లో 300 కోట్ల రూపాయల మద్యం అమ్ముడైనట్లు లెక్కలు చెబుతున్నాయి. అక్టోబర్ 10వ తేదీన రూ. 113 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు జరిగాయి.
మద్యం అమ్మకాల్లో నల్లగొండ టాప్
దసరా సెలవులు, పండగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సాగిన అమ్మకాల్లో ఐఎంఎఫ్ఎల్ డిపో నల్లగొండ రూ. 53.58 కోట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో ఐఎంఎఫ్ఎల్ 1,02,884 కేసుల మద్యం… 1,19,804 కేసుల బీర్లను మద్యం ప్రియులు లాగించేశారు. మహబూబ్ నగర్ (ఐఎంఎఫ్ఎల్ డిపో) రూ. 50.93 కోట్ల అమ్మకాలతో రెండో స్థానంలో, కరీంనగర్ (ఐఎంఎఫ్ఎల్ డిపో) రూ. 48.75 కోట్ల అమ్మకాలతో మూడో స్థానంలో ఉన్నాయి. ఇక హైదరాబాద్-1 పరిధిలో రూ. 20.41 కోట్లు, హైదరాబాద్-2 పరిధిలో రూ. 18.87 కోట్లు, రంగారెడ్డి-1 పరిధిలో రూ. 30.35 కోట్లు, రంగారెడ్డి-2 పరిధిలో రూ. 33.95 కోట్లు, మేడ్చల్-1 పరిధిలో రూ. 22.86 కోట్లు, మేడ్చల్-2 పరిధిలో రూ. 36.83 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. అయితే మెదక్ (ఐఎంఎఫ్ఎల్ డిపో) మాత్రం రూ. 19.34 కోట్లతో చివరి స్థానంలో ఉంది.





