– కోదండరాం
హైదరాబాద్,అక్టోబర్ 13(జనంసాక్షి): రాష్ట్రంలో విద్య, వైద్యం సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితి ఉందని… దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. ఫీజుల రియంబర్స్‌మెంట్ కోసం విద్యార్తులు చేస్తున్న ఆందోళనను గమనించాలన్నారు. అలాగే ఆరోగ్యశ్రీకి నిధులు నిలిచిపోవడంతో సామాన్యులకు ఆరోగ్య సేవలు అందడం లేదన్నారు. కార్పోరేట్ వ్యవస్థ వల్ల విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులో లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నాంపల్లిలోని కార్యాలయంలో ‘విద్య-వైద్యం’, ఐకాస నిర్మాణంపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బడ్జెట్‌లో రూ.3068 కోట్ల ఫీజు బకాయిలు చెల్లిస్తామన్న ప్రభుత్వం రూ.కేవలం 928కోట్లు మాత్రమే చెల్లించిందని తెలిపారు. రూ.640కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆ పథకం సేవలు ఆపేశారని.. దీనివల్ల పేదలు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై తమకు అనుమానాలున్నాయని… దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రంలో నిధులు తగ్గాయా? లేక దారి మళ్లిస్తున్నారా అని కోదండరాం ప్రశ్నించారు. ధనిక రాష్ట్రంలో చెల్లింపులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయని నిలదీశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోదండరామ్ అన్నారు.





