– శిథిలావస్థకు చేరింది
– పునర్నిర్మించుకోవాలి: సీఎం కేసీఆర్
హైదరాబాద్, జులై23(జనంసాక్షి):
హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిని తరలించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. శిథిలావస్థకు చేరి నిర్వహణ భారంగా మారిన ఈ ఆస్పత్రిని ఇంకా ఇక్కడే కొనసాగించలేమని సిఎం కెసిఆర్ తెలిపారు. దీనిని ఇదే పరిస్థితుల్లో ఎంత రిపేర్ చేసినా కష్టమని అన్నారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శిథిలావస్థకు చేరిన ఉస్మానియా ఆస్పత్రిని గురువారం సందర్శించారు. ఆస్పత్రి ఆవరణ, భవనంలోని ప్రతీ విభాగాన్ని పరిశీలించారు.ఉస్మానియా ఆసుపత్రిని వైద్య ఆరోగ్యశాఖా మంత్రి కే. లక్ష్మారెడ్డి,చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ తదితరులతో కలిసి గురువారం పరిశీలించారు. ఉస్మానియా ఆసుపత్రికి చెందిన పాత భవనంతోపాటు కులికుతుబ్ షా భవనం, అలాగే ఓపీ భవనాలను వారు పరిశీలించారు. కాగా… పురాతన భవనాల్లో ఇక ఎంతమాత్రం ఆస్పత్రని వీటిని పడగొట్టి వీటి స్థానంలో నూతన భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఉస్మానియా ఆస్పత్రిలో భయానక పరిస్థితులను గమనించానని కెసిఆర్ తెలిపారు. ఆస్పత్రి భవనం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రి భవనం చారిత్రక ప్రాధాన్యత కలిగినదే కావచ్చు కానీ అంతకన్నా పేషేంట్లు, డాక్టర్లు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థుల ప్రాణాలు ముఖ్య మన్నారు. దీనికోసం వందలమందిని బలిపెట్టలేమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారంలోగా ఆస్పత్రిని వేరే ప్రాంతానికి తరలిస్తామన్నారు. ఇందు కోసం జీహెచ్‌ఎంసీతో చర్చిస్తామన్నారు. దోబి రూమ్ సందర్శిస్తే అక్కడ ప్రమాదకర వాతావరణం కనిపించిందన్నారు. ఆ గది ఎప్పుడు కూలుతుందో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. నర్సింగ్ కాలేజీ కూడా ఇదే స్థితిలో ఉందని వివిరించారు. తాను ఆస్పత్రికి రావడమే ఆలస్యమైనట్టు భావిస్తున్నానని తెలిపారు. ఎప్పుడో ఆస్పత్రికి రావాల్సిందని అన్నారు. ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని చారిత్రక కట్టడాల జాబితా నుంచి తొలిగించేందుకు గవర్నర్‌ను, హైకోర్టు చీఫ్ జస్టిస్ ను కలుస్తానన్నారు. ఆస్పత్రి భవనం ఉన్న స్థలంలో నూతన భవనాన్ని నిర్మింపజేస్తామన్నారు.
మున్సిపల్ ఉద్యోగులు సమ్మెపై కెసిఆర్ సమాలోచనలు
మున్సిపల్ ఉద్యోగులు సమ్మె విరమించి వెంటనే విధుల్లో చేరాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే హైదరాబాద్‌లో కార్మికులు సమ్మె విరమించారు. జిల్లాల్లో కూడా సమ్మె విరమించాలన్నారు. ఒకవేళ ఉద్యోగులు సమ్మె విరమించకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఆర్థిక్థసితిపై అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక అందజేశారు. ఆస్తి పన్ను పెంచకుండా ఉద్యోగులకు వేతనాల పెంచలేమని మున్సిపల్ పాలకమండలి ప్రభుత్వం వద్ద నిస్సహాయత వ్యక్తం చేసింది. మున్సిపల్ కార్మికుల సమ్మెపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. తెలంగాణలోని అన్నీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందచేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్పందిస్తూ ఆస్తి పన్ను పెంచితే తప్ప ఉద్యోగుల జీతాలు పెంచలేమని కేసీఆర్ అన్నారు. 2006 నుంచి మున్సిపాలిటీలలో ఆస్తిపన్ను పెంచలేదని, నివేదికపై అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.





