విజయసాయి పిచ్చి పరాకాష్టకు చేరింది
– మోదీ బూట్లునాకే స్థితికి విజయసాయి చేరాడు
– చంద్రబాబును విమర్శించే స్థాయి ఆయనకులేదు
– అవిశ్వాసం సమయంలో పాల్గొనకపోతే జేసీపై క్రమశిక్షణా చర్యలుంటాయి
– తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
విజయవాడ, జులై19(జనం సాక్షి) : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరిందని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. మోదీ బూట్లునాకే స్థితికి విజయసాయిరెడ్డి దిగజారాడని విమర్శించారు. చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలను ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయి విజయసాయిరెడ్డికి లేదని తెలిపారు. తప్పుడు లెక్కలు రాసి రాజశేఖర్‌రెడ్డి, జగన్‌కు సహకరించిన వ్యక్తి విజయసాయిరెడ్డి అని వ్యాఖ్యానించారు. ఏపీ ఆత్మగౌరవం కోసం తాము ధర్మపోరాట దీక్ష చేస్తుంటే వైసీపీ ఊసరవెల్లిలా రంగులు మారుస్తుందని ఆయన దుయ్యబట్టారు. వైసీపీ డ్రామా కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఏపీ ప్రతిష్టతను జగన్, విజయసాయిరెడ్డి దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ డైరెక్షన్లో నడుస్తోన్న వైసీపీకి డిపాజిట్లు కూడా రావని స్పష్టం చేశారు. కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్ట్ గురించి మాట్లాడకుండా చంద్రబాబుపై విమర్శలు చేయడంలో అర్థం లేదన్నారు. అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేస్తే జైలుకు వెళ్లాల్సివచ్చిద్దని జగన్ భయపడుతున్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. తమిళనాడు ప్రభుత్వాన్ని మోదీ నడిపిస్తున్నారని అన్నారు. ఓటింగ్‌లో పాల్గొనకపోతే జేసీపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోందని, అవిశ్వాసం నెగ్గాలని ప్రజలంతా కోరుకుంటున్నారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.